బెదిరింపులు..ఉపసంహరణలు | - | Sakshi
Sakshi News home page

బెదిరింపులు..ఉపసంహరణలు

Oct 28 2026 6:12 AM | Updated on Oct 28 2026 6:12 AM

● రేపల్లె నియోజకవర్గంలో ఆరు నామినేషన్లు వెనక్కి ● మోళ్ళగుంట, లంకెవానిదిబ్బ, గంగడిపాలెం, ఉప్పూడిలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల ఉపసంహరణ ● బెదిరింపులు తట్టుకోలేకే పోటీనుంచి తప్పుకొన్నారంటూ ఆరోపణలు ● ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు.. నడింపల్లి, కళ్ళిఫలంలోనూ ఇదే పరిస్థితి

రేపల్లె: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ నామినేషన్‌ల ఉపసంహరణ ఘట్టం మంగళవారంతో ముగిసింది. రేపల్లె నియోజకవర్గ పరిధిలో ఆరు నామినేషన్‌లు ఉపసంహరణకు గురయ్యాయి. మొత్తం 65 ఎంపీటీసీ సెగ్మెంట్‌లలో 19 స్థానాలు ఏకగ్రీవం కాగా, 46 సెగ్మెంట్‌లలో పోటీ నెలకొంది. 12 స్థానాలకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్‌లు పడకపోవటం, నామినేషన్‌ల పరిశీలనలో ఒక నామినేషన్‌ తిరస్కరణకు గురికావటం, ఉపసంహరణలో ఆరు నామినేషన్‌లు ఉపసంహరించుకోవటంతో మొత్తం 19 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే పలుచోట్ల వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోవడం వెనుక కూటమి నాయకుల బెదిరింపులు, ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. నామినేషన్‌లు ప్రారంభమైన నాటి నుంచి ఉపసంహరణ వరకు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే లక్ష్యంగా కూటమి నాయకులు బెదిరింపులకు పాల్పడటంతో నిజాంపట్నం మండలంలో ఏకంగా 11 సెగ్మెంట్‌ల స్థానాలకు నామినేషన్లు దాఖలు చేయని పరిస్థితి నెలకొంది. చెరుకుపల్లి మండలంలో ఒక స్థానానికి నామినేషన్‌ పడలేదు.

బెదిరింపులతో ఆరు నామినేషన్‌లు ఉపసంహరణ...

కూటమి నాయకుల బెదిరింపులతో రేపల్లె మండలంలో 4, నిజాంపట్నంలో 1, చెరుకుపల్లి మండలంలో 1 స్థానంలో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు తమ నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. రేపల్లె మండలంలోని మోళ్లగుంట, లంకెవానిదిబ్బ, గంగడిపాలెం, ఉప్పూడి గ్రామాల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌లు ఉపసంహరించుకున్నారు. చెరుకుపల్లి మండలంలోని నడింపల్లి, నిజాంపట్నం మండలంలోని కళ్ళిఫలం సెగ్మెంట్‌లలోని అభ్యర్థులు తమ నామినేషన్‌లు వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయాస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కూటమి నాయకుల బెదిరింపులు, వేధింపులను తట్టుకోలేకే వారు పోటీనుంచి తప్పుకొన్నారని వైఎస్సార్‌ సీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం..

నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలంటూ కూటమి నాయకులు తెస్తున్న ఒత్తిళ్లపై అభ్యర్థులు గత రెండు రోజులుగా పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఫిర్యాదులపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో నాయకుల వేధింపులు అధికమై అభ్యర్థులు చేసేదిలేక నామినేషన్‌లు ఉపసంహరించుకున్నట్లు వైఎస్సార్‌ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో స్వేచ్ఛగా పోటీ చేసే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని, బెదిరింపులపై వచ్చిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement