బాపట్ల: అర్నాబ్ తుఫాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వివరాలను తెలిపారు. తుఫాన్ ప్రభావం బాపట్ల జిల్లాలోని ఆరు మండలాల్లోని 8 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న 127 గ్రామాలపై ఉండొచ్చన్నారు. ముంపునకు కూడా అవకాశం ఉందని తెలిపారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జాతీయ రహదారులపై ప్రయాణించే భారీ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేయాలని సూచించారు. తుఫాన్ సమయంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పొంగిపొర్లే కల్వర్టులు, వాగులు, వంకలను దాటేందుకు ప్రయత్నం చేయవద్దని తెలిపారు. స్థానిక సచివాలయాల సహకారంతో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు. బీచ్‌లను తాత్కాలికంగా మూసివేసి, మత్స్యకారులు, పర్యాటకుల భద్రతకు చర్యలు చేపట్టామన్నారు. పోలీసుల ముందస్తు సూచనలు పాటించి క్షేమంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో జిల్లా కమాండ్ కంట్రోల్ నంబర్ 83381 3228, 112 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రత్యేక బృందాలు రేపల్లె, నిజాంపట్నం ఓడరేవు ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. డీఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ బృందాలను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవసరమైన రక్షణ సామగ్రితోపాటు గజ ఈతగాళ్లను కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సమాచార వ్యవస్థకు అంతరాయం కలగకుండా కమ్యూనికేషన్ విభాగం ఆధ్వర్యంలో అవసరమైన చోట్ల 6 రిసీవర్ టవర్లను, 122 మాన్ పాక్స్, 6 వీహెచ్‌ఎఫ్ సెట్ల ద్వారా వేగవంతమైన సమాచార వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు.


