నెహ్రూనగర్ గుంటూరు నగరపాలక సంస్థ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ తొలి రోజైన మంగళవారం ప్రశాంతంగా ముగిసింది. తొలి రోజు ఏసీ కాలేజీలోని ఫెసిలిటేషన్ సెంటర్‌లో 367 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అడిషనల్ ఎలక్షన్ అథారిటీ, నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల సిబ్బంది ఎవరూ ఓటు హక్కు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ కొనసాగుతుందని, విధుల్లో ఉన్న ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓటు వేయడానికి వచ్చేవారు ఓటర్ ఐడీ, ఎన్నికల విధి నిర్వహణ ఉత్తర్వులు (అపాయింట్‌మెంట్ ఆర్డర్) విధిగా వెంట తెచ్చుకోవాలని సూచించారు.


