రొంపిచర్ల: పొలానికి వెళుతూ అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన మండలంలోని గోగులపాడు గ్రామంలో శనివారం జరిగింది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన దావులూరి భాస్కరరావు(43) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలో బొగ్గరం రోడ్ వద్ద అలవాల మేజర్ కాలువ సమీపంలో గల తన పొలాన్ని దున్నేందుకు ట్రాక్టర్ నడుపుకొంటూ వెళుతున్నారు. పొలం దగ్గరకు రాగానే ఎత్తుగా ఉన్న రోడ్ నుంచి లోతులో ఉన్న పొలంలోకి ట్రాక్టర్ దించుతుండగా అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ నడుపుతున్న భాస్కరరావు (43) దాని కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్తులు అధిక సంఖ్యలో అక్కడికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తిరగపడి ఉన్న ట్రాక్టర్‌ను పైకి లేపి, అక్కడ ఉన్న మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేట ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేశ్వరరావు తెలిపారు.
ఈవీఎం గోదాముల పరిశీలన
బాపట్ల: ఈవీఎం గోదాములను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంచాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ తెలిపారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఈవీఎం గోదామును త్రైమాసిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ శనివారం పరిశీలించారు. వీవీ ప్యాడ్, ఈవీఎం స్ట్రాంగ్ రూములను వివిధ రాజకీయపార్టీల నాయకుల సమక్షంలో గతంలో వేసిన సీల్ తొలగించి గోదాములను పరిశీలించారు. ఆ గోదాములకు సీలు వేయించి వాటిని పరిశీలించారు. ఈవీఎం తనిఖీ వివరాలను ఈ ఎంఎస్ పోర్టల్‌లో నమోదును ఆయన పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలను భద్రపరచాలన్నారు. సీసీ కెమెరాలను, ఈవీఎం గోదాములను జాగ్రత్తగా పర్యవేక్షించాలని కలెక్టర్ పోలీసులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆయన వెంట ఇన్‌చార్జి డీఆర్‌ఓ లవన్న, బాపట్ల ఆర్డీఓ హరికుమార్, తహసీల్దార్ సలీమా, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు షేక్ షఫీ, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మహిళల టీ–20 క్రికెట్ ప్రారంభం
మంగళగిరి రూరల్: మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యాన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్(డబ్ల్యూఎపిఎల్) టీ–20 క్రికెట్ తొలి సీజన్ శనివారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ వేడుకలకు హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారా బ్రాహ్మణి, డబ్ల్యూఏపీఎల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న భారత మహిళా క్రికెటర్ మిథాలిరాజ్ సంయుక్తంగా డబ్ల్యూఎపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.
రాయలసీమ జెన్‌స్టార్ విజేత
శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్ జుట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుకు మధ్య ప్రారంభ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాయలసీమ జెన్ స్టార్ జట్టు గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రాయలసీమ జెన్ స్టార్ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి గోదావరి గోల్డెన్ ఈగల్ జట్టును 116 పరుగులు చేశారు. వీరిలో కెప్టెన్ హెన్రీట్టా పెరీరా 63 పరుగులు, గుండుపల్లి ఉద్విత 30 పరుగులతో రాణించారు. రాయలసీమ జెన్ స్టార్‌లో బి అనూష మూడు వికెట్లు పద్మజ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ దిగిన రాయలసీమ జెన్ స్టార్ జట్టు మూడు వికెట్లు నష్టానికి 120 పరుగులు చేసి విజయం సాధించింది రాయలసీమ జెన్ స్టార్ లో ఓపెనర్లు సీత సాయి 33 పరుగులు శుభశ్రీ 23 పరుగులు చేశారు. బౌలింగ్‌లోను బ్యాటింగ్‌లోను పద్మజా రాణించింది. రెండవ మ్యాచ్ అమరావతి చాంపియన్స్‌కు వైజాగ్ ఫైర్ బర్డ్స్‌కు మధ్య మ్యాచ్ జరిగింది. ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్‌బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీరాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్‌తదితరులు పాల్గొన్నారు.


