ఏఎన్‌యూ(పెదకాకాని): సమానత్వం లేని స్వేచ్ఛ ద్వారా కేవలం ధనవంతులు, శక్తివంతులు మాత్రమే ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంటుందని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం న్యాయ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జస్టిస్ లావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న న్యాయ కళాశాలు విద్యార్థుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించుకుని రాణించాలని పిలుపునిచ్చా రు. సుమారు 80 సంవత్సరాల స్వతంత్య్ర భారతంలో ఇప్పటికీ కులాలు, మతాలపరంగా దేశం విడిపోయి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలో అంబేడ్కర్ పేర్కొన్న సౌభ్రాతృత్వాన్ని సాధించగలిగిన నాడే రాజ్యాంగంలో పేర్కొన్న పీఠికకు పరమార్థం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. సభకు న్యాయ విభాగాధిపతి ప్రొఫెసర్ విజయలక్ష్మి అధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా విచ్చేసిన హైకోర్టు పూర్వ న్యాయ మూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పూర్వ విద్యార్థులుగా తాము విద్యార్థుల అవసరం నిమిత్తం తమ అనుభవాన్ని పంచేందుకు అవసరమైన సెమినార్లకు వీలైతే సెమిస్టర్ తరగతులకు కూడా హాజరు కావాలని సూచించారు. వర్సిటీ వీసీ ఆచార్య కె.గంగాధర్ రావు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌న్స్ అన్ని రంగాలతో పాటు న్యాయ రంగంలో కూడా తీసుకువస్తున్న పరిణామ క్రమాన్ని అలాగే విద్యార్థులకు దాని యొక్క భవిష్యత్ ప్రయోజనాలను వివరించారు. విశ్రాంత వీసీ ప్రొఫెసర్ హరిగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ జస్టిస్ లావు నాగేశ్వరరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుమారు 6 సంవత్సరాల పాటు ఎన్నో కేసులలో సాహసోపేతమైన ధైర్యవంతమైన తీర్పులను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లావు నాగేశ్వరరావును ఏఎన్‌యూ గౌరవ విశిష్ట న్యాయశాస్త్ర ఆచార్యులుగా నియమిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. కార్యక్రమంలో న్యాయవిభాగంలో ఏర్పాటు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ కామర్స్ అండ్ లా ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సురేష్ కుమార్ తన వంతు సహాయంగా 25 వేల రూపాయలని ప్రకటించి విభాగంలో న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రెక్టార్ ఆర్.శివరామ ప్రసాద్, రిజిస్ట్రార్ జి.సింహాచలం, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్.రంగయ్య, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైస్ చైర్మన్ ఎస్.ప్రభాకరన్, తమిళనాడు, పుదుచ్చేరి బార్ అసోసియేషన్ సభ్యులు జి.మోహన్ కృష్ణణ్, పూర్వ విద్యార్థి విభాగం అధ్యక్షులు నర్రా శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, హైకోర్టు న్యాయవాదులు ఎర్రగొర్ల ఠాగూర్ యాదవ్, ఏఎన్‌యూ న్యాయ దిన్ ఫ్యాకల్టీ సిహెచ్ సుధాకర్ బాబు, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ ఆఫ్ లా ప్రిన్సిపాల్ ఎ.గురవయ్య పాల్గొన్నారు.


