త్వరలో ప్రత్యేక అధికారులను నియమిస్తాం..
ఒక్క అధికారి కోసం వందల మంది కార్మికుల ఇక్కట్లు మూడు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు అందని వేతనాలు వినాయక చవితి పండగ నాడూ పస్తులే.. ప్రత్యేకాధికారి పోస్టింగు కోసం ఓ అధికారి తీవ్ర యత్నాలు
వేటపాలెం: ఆదాయం కోసం ఆరాటమో.. పంతం కోసమో తెలియదు కాని ప్రత్యేకాధికారి పోస్టింగు కోసం ఓ డిప్యూటీ ఎంపీడీఓ పట్టు పట్టడం పారిశుద్ధ్య కార్మికుల పాలిట శాపంగా మారింది. ప్రతి నెలా జీతాలు అందితేగాని పోషణ జరగని కుటుంబాలు.. మూడు నెలలుగా పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే.. వేటపాలెం మండలం పరిధిలో తొమ్మిది పంచాయతీలకు ఐదేళ్లుగా ఎన్నికలు జరగలేదు. దీంతో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఐదు పంచాయతీలకు ఎంపీడీఓ, మరో నాలుగు పంచాయతీలకు డిప్యూటీ ఎంపీడీఓ రెండేళ్లుగా ప్రత్యేక అధికారులుగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం ఎంపీడీఓ పదోన్నతితో బదిలీపై వెళ్లిపోయాడు. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్న నాలుగు పంచాయతీలు కలిపి మొత్తం తొమ్మిది పంచాయతీలకు ప్రత్యేక అధికారుల నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ప్రత్యేక అధికారులు లేకపోవడంతో ఈ తొమ్మిది పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు, వీధి దీపాలు, తాగునీటి సిబ్బంది, వంటి వారి వేతనాలు గత మూడు నెలలుగా నిలిచిపోయాయి.
ఆదాయం ఉన్న పంచాయతీలపైనే గురి ?
మండల పరిధిలో ఆదాయ వనరులు అధికంగా ఉన్న కొత్తపేట, దేశాయిపేట, పర్యాటకంగా అభివృద్ధి చెందిన తీరప్రాంత గ్రామ పంచాయతీలైన అక్కాయిపాలెం, చల్లారెడ్డిపాలెం వంటి వాటికి ప్రత్యేక అధికారిగా వ్యవహరించేందుకు ఓ డిప్యూటీ ఎంపీడీఓ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం. ఈ మేరకు ఆ అధికారి ముఖ్య నేత ద్వారా జిల్లా పంచాయతీ అధికారికి సిఫార్సు చేయించినట్లు చర్చ జరుగుతోంది. ప్రత్యేక అధికారుల నియామకానికి నెల రోజుల క్రితం వేటపాలెం ఎంపీడీఓ కార్యాలయం నుంచి జిల్లా అధికారికి ఫైల్ పంపించారు. అయితే పైరవీలు జరుపుతున్న సదరు అధికారికి అనుకూలంగా లేని పంచాయతీలు కేటాయించడంతో ఆయన ఓ ముఖ్య నేతతో జిల్లా అధికారికి సిఫార్సు చేయించి తిరిగి ఆయనకు అనుకూలంగా ఉండే పంచాయతీలు వచ్చేలా సదరు ఫైల్‌ను తిప్పిపంపినట్లు సమాచారం. ఎట్టకేలకు తాజాగా అదే అధికారి కోరుకున్న పంచాయతీలకు ప్రత్యేక అధికారిగా నియమించాలని వారం రోజుల క్రితం తిరిగి ప్రతిపాదిస్తూ ఫైలు జిల్లా అధికారికి చేరినట్లు తెలిసింది.
వేతనాల కోసం ఎదురుచూపులు
వేతనాలు అందక వినాయక చవితి సమయంలోనూ చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడాల్సి వస్తోందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు ఇతర అభివృద్ధి పనులు కూడా ప్రభావిత మవుతున్నాయి. ఒక అధికారి పోస్టింగ్ వ్యవహారం కారణంగా ప్రత్యేక అధికారుల నియామకం ఆలస్యం అవుతుంటే, దాని భారాన్ని వందలాది మంది కార్మికులు మోయాల్సి వస్తోందని ఉద్యోగ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు జిల్లా ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కార్మికులు, ఉద్యోగ వర్గాలు కోరుతున్నారు.
వేటపాలెం మండల పరిధిలోని తొమ్మిది గ్రామాలకు ప్రత్యేక అధికారుల నియామకం కోసం వారం రోజుల కిందటే నావద్దకు ఫైల్ వచ్చింది. త్వరలోనే దానికి ఆమోదం తెలిపి ప్రత్యేక అధికారుల నియామకానికి అనుమతులు పంపిస్తాం.
– కె.ప్రభాకర్‌రావు,
జిల్లా పంచాయతీ అధికారి, బాపట్ల


