తిరుగు ప్రయాణ భయం
ప్రైవేట్ వాహనాలకు మొగ్గు
రెండో శనివారం, ఆదివారం, అనంతరం వినాయక చవితి అని ఏడాది ప్రారంభంలోనే అందరికీ తెలుసు.. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో ప్రయాణికుల రద్దీ దాదాపుగా రెట్టింపవుతుందని ముందే తెలుసు.. అయినా ఆర్టీసీ ప్రత్యామ్నాయ చర్యలు మాత్రం శూన్యం. తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండి అన్నరీతిలో ఉచిత బస్సులిచ్చాం.. నిలబడతారో.. కలబడతారో.. మీ ఇష్టం అన్నట్లుగా ప్రభుత్వ తీరు ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉన్న అరకొర బస్సుల్లో కాలు నిలిపేందుకు సైతం చోటు లేకపోవడంతో పండుగకు సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారి ఆశలు అడియాశలుగా మారాయి. భారీమొత్తం వెచ్చించి, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.
పండుగ ప్రయాణం.. నరకం
● వినాయకచవితి నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల తీవ్ర రద్దీ ● ముందస్తు ఏర్పాట్లు చేయని అధికారులు ● మూడు రోజులు సెలవులు రావటంతో గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌కు పోటెత్తిన ప్రయాణికులు ● రద్దీకి తగ్గట్లు సర్వీసులు ఏర్పాటు చేయని అధికారులు ● అరకొర బస్సుల్లో సీట్ల కోసం ప్రయాణికుల కొట్లాట ● కొన్ని బస్సుల్లో కాలు నిలిపే చోటు లేక ఇక్కట్లు
పట్నంబజారు: పండుగలకు ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని తెలిసినా.. అందుకు తగ్గట్టుగా బస్సు సర్వీసులు ఏర్పాటు చేయకపోవడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో పండుగ పూట సొంతూళ్లకు వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 14న వినాయక చవితి పండగ జరగనుండగా.. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వరుసగా మూడు రోజుల సెలవులు రావడంతో గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా పెరిగింది. ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాలతో సహా పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారితో ఆర్టీసీ గుంటూరు రీజియన్ బస్సులన్ని కిక్కిరిసిపోయాయి. మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులు అందుబాటులో లేకపోవడంతో గుంటూరు, ఇతర బస్టాండ్‌లలో గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.
400 బస్సులు ఏమూలకు..?
గుంటూరు రీజియన్ పరిధిలో గుంటూరు–1, గుంటూరు–2, తెనాలి, పొన్నూరు, మంగళగిరి తదితర డిపోలు ఉన్నాయి. రీజియన్ పరిధిలో సుమారు 400 వరకు బస్సులు ఉన్నప్పటికీ.. పండుగ సమయంలో ఒక్కసారిగా పెరిగిన రద్దీకి అవి సరిపోని పరిస్థితి ఏర్పడింది. గుంటూరు కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ బస్‌స్టేషన్ నుంచి నిత్యం 80వేల మందికిపైగా ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. పండుగల సమయంలో సుమారు 1.25లక్షల మందికిపైగా ప్రయాణం చేస్తారనేది అధికారుల అంచనా. ఇప్పటికే అత్యంత ప్రా ధాన్యం కలిగిన డిపో –2 ప రిధిలో సుమారు 80 బస్సులకుపైగా ఇతర డిపోలకు, విద్యుత్ బస్సుల ఏర్పాటు క్రమంలో భాగంగా తరలించేశారు. ప్రధాన మార్గాల్లో ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా సర్వీసులు అందు బాటులో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారింది.
సీట్ల కోసం పోటీ
బస్సు బస్టాండ్‌లోకి రాగానే సీట్ల కోసం ప్రయాణికులు పోటీపడుతున్నారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో కూర్చునే అవకాశం లేక నిల్చునే ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, రీజియన్ పరిధిలోని ఆయా డిపోల్లోనే బస్సులు నిండిపోవటంతో బస్సులు ఇక మార్గమధ్యంలో ఆపలేని దుస్థితి ఏర్పడింది. వినాయక చవితి తేదీ, వరుస సెలవుల విషయం ముందుగానే అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో గుంటూరు నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేయడంలో ఆర్టీసీ అధికారులు పూర్తి వైఫల్యం చెందారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలులో ఉన్న నేపథ్యంలో పండగ రద్దీ సమయంలో అదనపు బస్సుల ఏర్పాటుకు అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించని పరిస్థితులు కనపడ్డాయి.
పండగకు ముందు గుంటూరు నుంచి బయట ప్రాంతాలకు వెళ్లే రద్దీ ఒకవైపు అయితే.. పండుగ ముగిసిన తరువాత తిరిగి గుంటూరుకు చేరుకునే ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా ఉండే అవకాశం ఉంది. మహిళల ఉచిత ప్రయాణం, వరుస సెలవులు, పండగ అనంతరం ఉద్యోగులు, విద్యార్థులు తిరుగు ప్రయాణాలు కలిస్తే రద్దీ మరింత పెరిగే అవకాశముంది. ఇప్పటికై నా ఆర్టీసీ అధికారులు రద్దీ మార్గాలను గుర్తించి అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని, మహిళలు అధికంగా ప్రయాణించే మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో చోటు దొరకకపోవడంతో అనేక మంది ప్రయాణికులు ఆటోలు, కార్లు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబాలతో ప్రయాణించే వారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా కొందరు వాహనదారులు అధిక చార్జీలు వసూళ్లు చేస్తున్నారు. గుంటూరు నుంచి తెనాలికి నలుగురితో కూడిన కుటుంబ సభ్యులు వెళ్ళేందుకు ఆటోవాలాలు ఏకంగా రూ.1200 డిమాండ్ చేస్తుండగా, కార్ల బాడుగ అయితే రూ.1800 వరకు అడుగుతున్నారు. ఇక హైదరాబాద్, చైన్నె, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు వేలాది రూపాయలు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


