ముగిసిన ఏపీ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ఏపీ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు

Sep 14 2026 3:26 AM | Updated on Sep 14 2026 3:26 AM

ముగిసిన ఏపీ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ పోటీలు మణిపాల్‌ హాస్పిటల్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డులు చేతిరాతపైనే విద్యార్థుల భవిష్యత్‌ ఆటో బోల్తా.. ముగ్గురికి గాయాలు

తణుకు అర్బన్‌: పశ్చిమగోదావరి జిల్లా తణుకు చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్న 44వ ఏపీ మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీలు ఆదివారం ముగిశాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 450 మంది క్రీడాకారులు హాజరుకాగా 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్‌జంప్‌, హై జంప్‌, షాట్‌పుట్‌, డిస్కస్‌త్రో, జావలిన్‌ త్రో అంశాల్లో పోటీలు నిర్వహించారు. వీరిలో 115 మంది క్రీడాకారులు విజేతలుగా నిలిచి తమిళనాడులో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పోటీల ఆర్గనైజర్‌ సంకు సూర్యనారాయణ తెలిపారు. రెండు రోజులపాటు జరిగినల టోర్నమెంట్‌లో ఓవరాల్‌ చాంపియన్స్‌గా పార్వతీపురం మన్యం జిల్లా, మెన్స్‌ చాంపియన్స్‌గా గుంటూరు జిల్లా, ఉమెన్స్‌ చాంపియన్స్‌గా పశ్చిమగోదావరి జిల్లా జట్టు నిలిచాయాన్నరు. విజేతలకు ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ చేతులమీదుగా బహుమతులు అందించారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌ తణుకు ప్రాంతంలో నిర్వహించడం శుభ పరిణామమని పితాని కొనియాడారు. నాయకులు బసవ రామకృష్ణ, వావి లాల సరళాదేవి, బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి శ్రీనివాస్‌, రాష్ట్ర సెక్రటరీ సీహెచ్‌ జగదీష్‌, జిల్లా అధ్యక్షుడు బి.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

తాడేపల్లి రూరల్‌: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్‌ హాస్పిటల్‌ అందిస్తున్న ఆధునిక వైద్యసేవలకు గుర్తింపుగా ఇటి హెల్త్‌కేర్‌ అవార్డ్స్‌–2026లో రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నట్లు హాస్పిటల్‌ డైరెక్టర్‌ శ్రీరామాంజనేయరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలో నైపుణ్యం, వివిధ వైద్య విభాగాల సమన్వయంతో అందించే క్లినికల్‌ కేర్‌, అత్యాధునిక చికిత్సా విధానాలు, సమగ్ర వైద్యసేవలు అందించడంలో చూపుతున్న నిబద్ధతకు గుర్తింపుగా ‘హాస్పిటల్‌ ఆఫ్‌ ది ఇయర్‌, ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సౌత్‌’ అవార్డు లభించిందని తెలిపారు. మణిపాల్‌ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్స్‌ అండ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జరీ వైద్యులు డాక్టర్‌ జీవీ రెడ్డికి ‘ఆర్థోపెడిక్‌ సర్జన్‌ ఆఫ్‌ ది ఇయర్‌–సౌత్‌’ అవార్డు వచ్చినట్టు వివరించారు. ఈ రెండు అవార్డులు తమ హాస్పిటల్‌కు ప్రత్యేకమైన గుర్తింపుగా నిలుస్తాయని ఆయన తెలిపారు.

బాపట్లటౌన్‌: విద్యార్థుల భవిష్యత్తు చేతిరాతపైనే ఆధారపడి ఉందని క్వాలిగ్రఫీ టీం లీడర్‌ వి.రామ్మోహన్‌రావు అన్నారు. రెండు రోజులుగా బాపట్ల సరస్వతి మెమోరియల్‌ గవర్నమెంట్‌ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు అందమైన చేతి రాతకు సంబంధించి ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఇప్పటివరకు మన రాష్ట్రంలో 152 శిక్షణ తరగతుల ద్వారా సుమారు 94వేల మంది ప్రభుత్వ విద్యార్థులకు 7,350 ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారన్నారు. సెలవు రోజుల్లో సైతం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ శిక్షణ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వారి యొక్క పాఠశాలలోని విద్యార్థుల చేతిరాతను మెరుగుపర్చాలన్నారు. విద్యార్థుల చేతిరాతను అందంగా మలిచిన ఉపాధ్యాయులు వారి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. శిక్షణకు ముందు ఫ్రీ టెస్ట్‌, శిక్షణ అనంతరం పోస్టు టెస్టు నిర్వహించి, ఈ రెండు రోజుల చేతిరాత శిక్షణలో మంచి ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు ఉచితంగా 10లూసిడా హ్యాండ్‌ రైటింగ్‌ శిక్షణా పుస్తకాలను అందజేశారు. ’నుదుటి రాత రాసేది బ్రహ్మ – చేతి రాత మార్చేది గురుబ్రహ్మ’, ’చేతి రాతే –విద్యార్థి భవిత’ అంటూ ప్రభుత్వ బడులను బలోపేతం కోసం క్యాలిగ్రఫీ ఉద్యమాన్ని మరింతగా ముందుకు తీసుకు వెళ్తామన్నారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

చిలకలూరిపేట టౌన్‌: ఆటో బోల్తా పడిన ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పట్టణ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఒంగోలు సమీపంలోని ఈతముక్కల ప్రాంతానికి చెందిన వూట్ల రాజేశ్వరి (24) కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతోంది. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను ప్రతివారం మంగళగిరి ఎయిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చికిత్స పూర్తి చేసుకుని కుటుంబ సభ్యులతో ఆటోలో స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. చిలకలూరిపేట సమీపంలోని పోలిరెడ్డిపాలెం బైపాస్‌ వంతెన వద్ద ఆదివారం ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో రాజేశ్వరితో పాటు మరో భర్త అశోక్‌, వృద్ధురాలు మర్రిపూడి సుశీలకు గాయాలయ్యాయి. వీరిలో సుశీల తీవ్రంగా గాయపడింది. డ్రైవర్‌కు నిద్రమత్తుతో ఇబ్బంది పడుతుండగా అశోక్‌ తనకు డ్రైవింగ్‌ వచ్చని చెప్పి కొద్దిదూరం ఆటో నడిపేందుకు ప్రయత్నించాడు. పోలిరెడ్డిపాలెం బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో బైపాస్‌పై కొనసాగాలా.. సర్వీసు రోడ్డులోకి దిగాలా అనే విషయంలో అశోక్‌ అయోమయానికి గురయ్యాడు. అప్పుడే వాహనంపై నియంత్రణ కోల్పోయి వెంటనే బ్రేక్‌ వేయడంతో ఆటో బోల్తా పడింది. 108 సిబ్బంది వెళ్లి గాయపడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement