పాత దుకాణాలకే కొత్త కిక్కు | - | Sakshi
Sakshi News home page

పాత దుకాణాలకే కొత్త కిక్కు

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

మళ్లీ వారికే...

మద్యం షాపుల లైసెన్స్‌లు మరో ఏడాది రెన్యూవల్‌ అన్ని ట్యాక్సులు కలిపి రెన్యూవల్‌కు రూ.కోటిపైనే ఖర్చు ‘స్థానిక’ ఎన్నికల వేళ ఆదాయం కోసం టీడీపీ సర్కారు పాట్లు

మళ్లీ వారికే...

చీరాల: సర్కారు గల్లా పెట్టెకు కిక్కు సరిపోవడం లేదు... ఇంకో ఏడాది పెంచితే అదనంగా మరింతగా ఆర్జించవచ్చనే ఆలోచనతో కూటమి సర్కారు మద్యం షాపుల లైసెన్స్‌లను మరో ఏడాది పాటు పొడిగించింది. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టి ప్రజల సొమ్మును లూటీ చేసే రీతిలో మద్యం వ్యాపారం సాగుతోంది. మద్యం షాపుల లీజు గడువు అక్టోబర్‌ 2వ తేదీతో ముగియనుంది. అయితే కొత్త మద్యం పాలసీ తీసుకురాకుండా పాత వాటినే రెన్యువల్‌ చేస్తోంది. మద్యం వ్యాపారం నష్టాల్లోనే ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. మళ్లీ పాత వారికే ఏడాది పాటు లైసెన్స్‌లు రెన్యూవల్‌ చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తుండడంతో అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో ఇదీ పరిస్థితి...

జిల్లాలో మొత్తం 128 మద్యం షాపులున్నాయి. అలాగే గీత కార్మికులకు 12 షాపులు కేటాయించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో లాటరీ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్కో షాపు పొందేందుకు రూ.2 లక్షల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ విధానాన్ని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ఎక్కువ మొత్తంలో డీడీలు తీశారు. చీరాల ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధిలోని 32 షాపులకు గాను ఒక్కో షాపునకు దాదాపు 20 డీడీల వరకు తీశారు. రెండేళ్లకు గాను ఈ షాపులన్నీ లాటరీ విధానంలో లీజుకు ఇచ్చారు. వీటిలో గీత కార్మికులకు కూడా కొన్ని అప్పగించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో మద్యం షాపుల్లో మద్యం అమ్మకాల ద్వారా రూ.844 కోట్ల ఆదాయం వచ్చింది. షాపులు దక్కించుకున్న వారు పక్కా ప్రణాళికతో షాపునకు కొన్ని బెల్టు షాపులు కూడా నిర్వహిస్తున్నట్లు సమాచారం.

20 శాతం కమీషన్‌ పేరుతో ఆశ

మద్యం అమ్మకాలను రాష్ట్రంలో పెంచేందుకు ప్రభుత్వం మద్యం వ్యాపారులకు మొదట్లో ఆశలు కల్పించింది. దుకాణదారులకు 20 శాతం కమీషన్‌ ఇస్తామని చెప్పింది. తొలుత 9 శాతం చొప్పున ఇచ్చారు. తర్వాత 10 శాతం చేశారు. అనంతరం 14 శాతానికి పెంచారు. ప్రభుత్వం ముందు చెప్పిన కమీషన్‌ ఇవ్వకపోవడంతో అధిక పెట్టుబడి పెట్టి తాము నష్టపోయామని వ్యాపారులు వాదనలు తెరపైకి తెచ్చారు. అయితే ఎమ్మార్పీ కన్నా క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 అదనంగా వసూలు చేయడం జరుగుతూనే ఉంది. బెల్టు షాపుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు బాదేస్తున్నారు.

రాష్ట్రంలో అమలవుతున్న మద్యం పాలసీలో భాగంగా 2024లో లాటరీలో షాపులు దక్కించుకున్న వారు రెండేళ్లకు లీజు నిమిత్తం రూ.71 లక్షల చలానా, రూ.7.50 లక్షలు పర్మిట్‌ ఫీజును మొత్తం విడతల వారీగా చెల్లించాలని ఆదేశించారు. అక్టోబర్‌ 2వ తేదీతో లైసెన్స్‌ల గడువు తీరడంతో మరో ఏడాది గడువు పెంచారు. గత ఏడాది చెల్లించిన వార్షిక ఎకై ్సజ్‌ రుసుంపై 38 శాతం రెన్యూవల్‌ ఫీజు చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో చలానా ఖర్చు, పర్మిట్‌ రూమ్‌ల ఖర్చు వెరసి మొత్తం రూ.1.8 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని నాలుగు, ఐదు విడతల్లో నగదును జమ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్కో షాపు రోజుకు రూ.3.5 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు అమ్మకాలు సాగిస్తేనే చెల్లించిన నగదుకు సర్దుబాటు అవుతుంది. మద్యం పాలసీని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుని ఆదాయం గడిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా లేని ఫీజులు ఆంధ్రప్రదేశ్‌లో వసూలు చేస్తూ ఖజానాను నింపుకొనే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement