శివ శక్తి.. వీక్షణతో సంతృప్తి | - | Sakshi
Sakshi News home page

శివ శక్తి.. వీక్షణతో సంతృప్తి

Sep 13 2026 7:46 AM | Updated on Sep 13 2026 7:46 AM

ప్రత్యేకత చాటుతున్న రాయన గిరిధరగౌడ్‌ చిత్రాలు 14 నుంచి ఢిల్లీలో కనువిందు చేయనున్న ప్రదర్శన

తెనాలి: తెనాలికి చెందిన అంతర్జాతీయ చిత్రకారుడు రాయన గిరిధరగౌడ్‌ తాజా చిత్రాలు దేశ రాజధాని ఢిల్లీలో కళాప్రియులను ముగ్ధులను చేయనున్నాయి. ఆరుగురు చిత్రకళాకారులతో కలిసి అక్కడి బికనీర్‌ హౌస్‌లోని సెంట్రల్‌ హాలులో ఈ బృంద ప్రదర్శన ఏర్పాటు కానుంది. ఈ నెల 14 నుంచి 22వ తేదీ వరకు జరిగే ప్రదర్శనలో గిరిధర్‌గౌడ్‌వి ఐదు పెయింటింగ్స్‌, పది రేఖాచిత్రాలు కొలువుదీరనున్నాయి.

విభిన్న శైలులు...

మైసూర్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌లో డిగ్రీ, బరోడాలో పీజీ చేసిన గిరిధరగౌడ్‌ అక్కడే కొంతకాలం ఫ్యాకల్టీగా పనిచేశారు. ఉద్యోగ జీవితం సంతృప్తిగా అనిపించక తెనాలి సమీపంలోని స్వస్థలం గరువుపాలెంలో స్థిరపడ్డారు. అక్కడే చిత్రకళా రచనలో ప్రయోగాలు చేస్తున్నారు. ఉపాధ్యాయుడైన తండ్రి ప్రభావంతో తొలిదశలో పౌరాణిక చిత్రాలను గీస్తూ వచ్చారు.

కేంద్ర ప్రభుత్వ సీనియర్‌ ఫెలోషిప్‌తో లేపాక్షి చిత్రకళపై చేసిన పరిశోధన అనంతరం చిత్రకళా రీతుల్లో గణనీయమైన మార్పు వచ్చింది. ఐదు శతాబ్దాల నాటి లేపాక్షి కళలోని మంచి లక్షణాలను, శైలిని దృష్టిలో ఉంచుకొని నవ్యధోరణితో, రంగుల మేళవింపుతో ఆధునికతను మేళవిస్తున్నారు. చిత్రకళా రచనలో ‘దశావతారాలు’ నుంచి రకరకాల సిరీస్‌లను తీసుకొచ్చారు. ఆ క్రమంలో చిత్రీకరించిన కళాఖండాలను ‘శివ శక్తి’ సిరీస్‌గా గతేడాది హైదరాబాద్‌ కళాకృతిలో ప్రదర్శించారు. గత మూడు దశాబ్దాల్లో వివిధ రాష్ట్రాల్లోని గ్యాలరీల్లో 10 సోలో ఎగ్జిబిషన్లు చేశారు గిరిధరగౌడ్‌. దేశవ్యాప్తంగా జరిగిన 37 గ్రూప్‌ ఎగ్జిబిషన్లలోనూ చిత్రాలను ప్రదర్శించారు. వీటిలో లండన్‌, న్యూయార్క్‌, సింగపూర్‌, చైనా తదితర ఎగ్జిబిషన్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఫెలోషిప్‌, రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలతోపాటు అనేక కళాసంస్థల నుంచి గౌరవాన్ని అందుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement