మండపాలకు అనుమతులు తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

మండపాలకు అనుమతులు తప్పనిసరి

Sep 10 2026 1:45 AM | Updated on Sep 10 2026 1:45 AM

ట్రాఫిక్‌కు అంతరాయం ఉండరాదు మండపాల వద్ద సీసీ కెమెరాలు, విద్యుత్‌ లైటింగ్‌ ఉండాలి అధిక సౌండ్‌తో డీజేలు ఉపయోగిస్తే కఠిన చర్యలు పోలీసులు అనుమతించిన మార్గంలోనే ఊరేగింపు కొనసాగించాలి ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశంలో జిల్లా ఎస్పీ

బాపట్ల టౌన్‌: వినాయక మండపాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్‌ తెలిపారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో బుధవారం జిల్లాలోని వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వినాయక విగ్రహాల ఏర్పాటు, ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించేలా అధికారులు, కమిటీ సభ్యులు వ్యవహరించాలన్నారు. సంబంధిత శాఖలు, పోలీస్‌ అధికారుల అనుమతి పొందిన తర్వాతే మండపాన్ని ఏర్పాటు చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. అనుమతి పత్రాన్ని మండపం వద్ద ప్రదర్శించాలని తెలిపారు. ట్రాఫిక్‌, ప్రజల రాకపోకలకు ఆటంకం కలగని ప్రదేశాలను ఎంపిక చేసుకోవాలన్నారు. ఫైర్‌, అంబులెన్స్‌ వంటి అత్యవసర వాహనాలు ప్రయాణించే విధంగా మార్గం ఉండాలని సూచించారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, తీగలు, స్తంభాల వద్ద మండపాలను ఏర్పాటు చేయరాదన్నారు. మండపాల వద్ద ఫైర్‌ ఎక్స్‌టింగ్విషర్లు, నీటి డ్రమ్ములు, ఇసుక బకెట్లు సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. సిలిండర్లు, వంట సామగ్రి, బాణసంచా ఉంచరాదన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు, తగినంత లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. మండపాల వద్ద మద్యం, జూదం, అసభ్య ప్రవర్తనకు తావు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఇతర మతాల వారి మనోభావాలు దెబ్బతినేలా నినాదాలు, బ్యానర్లు, పాటలు ప్రదర్శించరాదని హెచ్చరించారు. పోలీసులు అనుమతించిన మార్గాల్లోనే ఊరేగింపు సాగాలన్నారు. ఫిట్‌నెస్‌ అనుమతులు పొందిన వాహనాలనే ఊరేగింపునకు ఉపయోగించాలని పేర్కొన్నారు. లైసెన్స్‌, అనుభవం కలిగిన వ్యక్తినే వాహన డ్రైవర్‌గా నియమించాలని సూచించారు. మద్యం సేవించిన వారు ఊరేగింపు వాహనాన్ని నడపడం గానీ, వాహనంలో ఎక్కడం గానీ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

విద్యుత్‌ వసతిపై దృష్టి పెట్టండి

రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు అధిక శబ్దంతో కూడిన డీజేలు, సౌండ్‌ సిస్టమ్‌ల వినియోగం పూర్తిగా నిషేధమని చెప్పారు. మండపాల వద్ద ఎలక్ట్రికల్‌ సేఫ్టీ ఆడిట్‌ నిర్వహించి ప్రమాదకరమైన వైరింగ్‌, వేలాడే తీగలను సరిచేయాలన్నారు. ఊరేగింపు మార్గాల్లో తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ తీగలను తొలగించి, నిమజ్జన ఘాట్ల వద్ద సురక్షిత విద్యుత్‌, లైటింగ్‌ సౌకర్యం కల్పించాలని విద్యుత్‌శాఖ అధికారులకు సూచించారు. రౌడీషీటర్లు, గతంలో సమస్యలు సృష్టించిన వారిపై నిఘా ఉంచి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాఫిక్‌ మళ్లింపులు, పార్కింగ్‌ స్థలాలను ముందుగానే ప్రకటించాలన్నారు. అంబులెన్స్‌, అత్యవసర వాహనాలకు నిరంతరాయంగా మార్గం ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గణనాథుని పండుగను ప్రతిఒక్కరూ ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు, అధికారులు, జిల్లాలోని వివిధ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement