న్యూస్‌రీల్
రోజుకు 50 వేల లీటర్ల వ్యర్థాలు విడుదల సముద్రాన్ని కలుషితం చేస్తున్న వ్యాపారులు కన్నెత్తి కూడా చూడని అధికారులు మత్స్యసంపదకు, సందర్శకులకు చేటు
బుధవారం శ్రీ 9 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కడలి గర్భంలోకి
ఆహ్లాదాన్ని పంచాల్సిన సముద్ర తీరం రోగాలకు నిలయంగా మారింది. బాపట్ల జిల్లా తీరంలో వదులుతున్న కుళ్లిన వ్యర్థాలు, రొయ్యల ఫ్యాక్టరీలు, హేచరీల నుంచి వచ్చే రసాయన నీటితో తీరం విషమయం అవుతోంది. కళ్లెదుటే సముద్ర గర్భం కాలుష్య విషపు కోరల్లో చిక్కుకుంటున్నా అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
చీరాల టౌన్: జిల్లాలోని పర్యాటక తీర ప్రాంతాలైన వాడరేవు, రామాపురంతో పాటు బాపట్ల సూర్యలంక, నిజాంపట్నం, చినగంజాం తీర ప్రాంతాలకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. జిల్లాలో 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. ఈ తీరం ఒడ్డునే మత్స్య సంపదను ఎగుమతి చేసేందుకు పలురకాల ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి. వీటితో పాటు రొయ్యలు, చేపల ప్రాసెసింగ్ కంపెనీలతో పాటు హేచరీలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.లక్షల్లో సంపాదించే బడా వ్యాపారస్తులు రోజుకు 1.5 లక్షల లీటర్ల నీటిని వినియోగిస్తుంటారు. చేపలు శుభ్రం చేయడానికి, రొయ్యల నుంచి మాంసం తయారీకి నీరు కావాల్సిందే. ఇలా వ్యర్థ నీటిని ట్యాంకర్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. రోజూ రాత్రి ఎనిమిది గంటల నుంచి తెల్లవారుజాము వరకు ట్యాంకర్ల ద్వారా కుళ్లిన వ్యర్థాలు, క్రిమిసంహారక నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇలా రోజుకు 50 వేల లీటర్ల నీరు కడలిని కలుషితం చేస్తున్నట్లు అంచనా. చేపలు కూడా లభ్యం కావడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే ఉండే మత్స్యశాఖ ఉద్యోగులు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ఉద్యోగులు కళ్లు మూసుకుని విధులు నిర్వహిస్తున్నారా...? అని పర్యాటకులు విమర్శిస్తున్నారు.
ప్రజల ప్రాణాలకే ముప్పు..
ఏడాదికి ఒక్కో ప్లాంట్ సగటున రూ.10 కోట్లు నుంచి రూ.20 కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు చేస్తుంటాయి. వ్యాపారులు మాత్రం కనీసం ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవడం లేదు. రోజుకు ఒక్కో ప్లాంట్ లక్షల లీటర్ల నీటిని వినియోగించాల్సి ఉంటుంది. ఈ నీటిని రీసైక్లింగ్ చేసుకునేందుకు విధిగా ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎనిమిది పరిశ్రమల్లో ఎక్కడా కనిపించలేదు. కార్మికశాఖ నుంచి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు లేవు. వ్యర్థాలు, రసాయనాలను సముద్రంలోకి వదలడం వలన మత్స్య ఉత్పత్తి తగ్గడం, ఈ నీటిలో స్నానాలు చేస్తే చర్మ సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు చెబుతున్నారు.


