రిజిస్ట్రేషన్‌ రద్దుతో కథ కంచికేనా? | - | Sakshi
Sakshi News home page

రిజిస్ట్రేషన్‌ రద్దుతో కథ కంచికేనా?

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

మున్సిపల్‌ రిజర్వు స్థలంపై రిజిస్ట్రేషన్‌ రద్దు చేసుకున్న ఏడుగురు వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్న స్థానికులు

యడ్లపాడు: పట్టణ నడిబొడ్డున రూ.కోట్ల విలువైన మున్సిపల్‌ రిజర్వు స్థలానికి సంబంధించి సాగిన రిజిస్ట్రేషన్‌ వ్యవహారం చివరకు రద్దుతో ముగిసింది. అయితే రిజిస్ట్రేషన్లు రద్దయినంత మాత్రాన అసలు ప్రశ్నలు మాత్రం సమసిపోలేదు. ప్రభుత్వ స్థలానికి ప్రైవేటు సంస్థ పేరుతో పన్ను రశీదు ఎలా జారీ అయింది? సర్వే నంబర్‌ మార్పుతో ఎండార్స్‌మెంట్‌ ఎవరి ఆదేశాలతో వచ్చింది? ఆ పత్రాల ఆధారంగా రిజిస్ట్రేషన్లకు మార్గం ఎవరు సుగమం చేశారు? అనేది అధికార వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

రిజిస్ట్రేషన్‌తో వెలుగులోకి...

స్థానిక ఫైర్‌స్టేషన్‌ రోడ్డులోని హెచ్‌.హెచ్‌. డైక్‌మెన్‌ నగర్‌లో ఉన్న 27 సెంట్ల మున్సిపల్‌ రిజర్వు స్థలంలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఆ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఏఎంజీ డేకేర్‌ సెంటర్‌ ఏర్పాటుతో అనేక సేవలు అందించింది. ఆ సేవలు నిలిచిపోయాక సదరు స్థలాన్ని ఈ ఏడాది ఆగస్టు 11న ఏడుగురి పేర్లతో దాన దస్తావేజుల ద్వారా రిజిస్టర్‌ చేసినట్లు రికార్డులు వెలుగులోకి వచ్చాయి. ఇందులో అధికారపార్టీ నేతలు కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై ఈ నెల 7వ తేదీన ‘‘ప్రజా ఆస్తి.. ‘పచ్చ’నేతల పరం’’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. పట్టణంలోని కీలక ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తుల పేర్లకు బదలాయింపునకు దస్తావేజులు సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. వివాదం ముదరడంతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వారు సోమవారం రాత్రి చిలకలూరిపేట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకుని దాన దస్తావేజులను రద్దు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

స్థలం మున్సిపాలిటీదే...!

ఇదే విషయమై మున్సిపల్‌ కమిషనర్‌ పి. శ్రీహరిబాబును వివరణ కోరగా.. సర్వే నంబర్‌ 88/1లో ఉన్న స్థలం వివాదంలోకి రాగానే సదరు స్థలం తమ శాఖదేనని అక్కడ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశామన్నారు. రిజిస్టర్‌ చేసుకున్న వారు వాటిని స్వచ్ఛందంగా సోమవారం రద్దు చేసుకున్నారని తెలిపారు. ఇక స్థలంపై ఎలాంటి వివాదం లేదని, పూర్తిగా తమ స్వాధీనంలో ఉందని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement