సత్తెనపల్లి: పట్టణ ప్రజలకు తాగునీటిని అందించే లక్కరాజుగార్లపాడు రోడ్‌లోని చెరువును ఇరిగేషన్ ఎస్‌ఈ టీ రమేష్ మంగళవారం పరిశీలించారు. కాలువల నుంచి విడుదలైన నీటిని పట్టణ ప్రజల తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని చెరువు నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును ఆయన పరిశీలించి ఇరిగేషన్, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు ఇరిగేషన్ ఈఈ మురళీధర్, ఏఈ సుందర్‌రావు, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ బి.మధుసూదనరావు, ఏఈ సాగర్‌మరియరాజు, సిబ్బంది ఉన్నారు.
గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని లాంఫాం సార్వత్రిక, దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించినట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎ.మణి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్న రెండు నెలలపాటు తేనెటీగల పెంపకం, చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత, ఉత్పత్తుల తయారీ వంటి కోర్సులు నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు రూ.1,500 చొప్పున ఫీజు చెల్లించి కోర్సుకు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్ సదుపాయం కంప్యూటర్, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్, ఐపాడ్ కలిగి ఉండాలన్నారు. దరఖాస్తు గడువును ఈనెల 30వ తేదీగా నిర్ణయించారన్నారు. ఆసక్తి కలిగినవారు మరిన్ని వివరాలకు ఏఎన్‌జీఆర్‌ఏయూ.ఏసీ.ఇన్ వెబ్‌సైట్‌ను గానీ, 70366 89346, 91822 45693 ఫోన్ నంబర్లనుగానీ ఉదయం 9–సాయంత్రం 7 గంటల వరకు సంప్రదించాలన్నారు.
గుంటూరు మెడికల్: ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు ఆగస్టు 21 వ తేదీ నుంచి పలు రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం జీజీహెచ్‌లో నల్లమాస్క్‌లు ధరించి నిరసన తెలియజేశారు. తమ ఉద్యోగాలను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు నూరు శాతం గ్రాస్ జీతం చెల్లించాలన్నారు. బదిలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సులు రమాదేవి, సుజిత, హైమావతి, శైలజ, భార్గవి, అంజలి, ల్యాబ్ టెక్నీషియన్లు ఖాసీం, రమేష్, వాణి, ఆదిలక్ష్మి, శైలజ, ఫార్మాసిస్టులు శ్రీలక్ష్మి, సుజాత, అశ్విని తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు లీగల్: అక్షరాలు జీవితాన్ని మార్చగలవని, చదువుకున్న సమాజం దేశ భవిష్యత్తును మార్చగలదని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియాఉద్దీన్ అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మంగళవారం గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జియాఉద్దీన్ మాట్లాడుతూ అక్షరాస్యత అంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం కాదన్నారు. హక్కులు, బాధ్యతలు తెలుసుకోవడం, ప్రభుత్వ పథకాలను అర్థం చేసుకోవడం అన్నారు. మహిళ చదువుకుంటే కుటుంబం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఒకరినైనా అక్షరాస్యులుగా మార్చేందుకు మనవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏడీ ఎం.వెంకట రమణప్ప, జిల్లా బాలల పరిరక్షణ సంస్థ అధికారి సీహెచ్ విజయ్‌కుమార్, డీపీఓ పి.వి.నాగసాయికుమార్, సోషల్ వెల్ఫేర్ శాఖ సూపరింటెండెంట్ కె.మధుసూదన్, ట్రైబల్ వెల్ఫేర్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఎ.పద్మావతి, ప్యానెల్ అడ్వకేట్ కె.కాళిదాసు, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


