నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి | - | Sakshi
Sakshi News home page

నాణ్యత నాస్తి.. కమీషన్లు జాస్తి

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

రేపల్లె–నిజాంపట్నం రోడ్డు పనుల తీరుపై తీవ్ర ఆరోపణలు రూ.9.70 కోట్లతో నిర్మించినా నెలల్లోనే పలుచోట్ల ధ్వంసం కమీషన్ల మాయాజాలంలో కరిగిపోయిన నాణ్యత

రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో ప్రభుత్వం నుంచి రూ.కోట్లు నిధులు మంజూరు చేయించుకుని, కాంట్రాక్టరుగా తామే అవతారం ఎత్తుతున్నారని టీడీపీ నాయకులపై ఆరోపణలు వస్తున్నాయి. ఒకవేళ కాంట్రాక్టర్లకు అప్పగించినా భారీగా కమీషన్లు దండుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారం స్థానిక ఎమ్మెల్యే, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కనుసన్నల్లోనే సాగుతోందన్న ఆరోపణలు ముదురుతున్నాయి. అభివృద్ధి పేరుతో నిధులు తెచ్చి నాణ్యత లేని పనులు చేయించడం ద్వారా ప్రజల సొమ్ము దోపిడీకి గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

అధ్వానంగా పరిస్థితి

తాజాగా ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇసుకపల్లి నుంచి నిజాంపట్నం వరకు రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి నెలలు గడవకముందే గుంతలమయంగా మారడం తీవ్ర చర్చకు దారితీసింది. నూతనంగా వేసిన రోడ్డు ఇలా త్వరగా దెబ్బతినడం నాణ్యత ప్రమాణాలను పాటించలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది నెలల క్రితం ప్రారంభించి హడావుడిగా పల్లపట్ల గ్రామం వరకు పూర్తి చేశారు. పూర్తయిన రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా గాలికి వదిలేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్కిలేరు నుంచి సజ్జవారిపాలెం వరకు రహదారి ఒక్క వర్షానికే ఛిద్రమైపోవడం నిర్మాణ లోపాలను బట్టబయలు చేస్తోంది. ఈ రహదారి పనుల వెనుక భారీ స్థాయిలో కమీషన్‌ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు స్థానికంగా హాట్‌టాపిక్‌గా మారాయి. కాంట్రాక్టర్‌ నుంచి రాజకీయంగా ప్రభావశీలుల పేరుతో భారీ వసూళ్లు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ల ఒత్తిడితోనే నాణ్యతను పూర్తిగా తాకట్టు పెట్టి పనులు చేపట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కాగితాలకే పరిమితమైన తనిఖీలు, కాంట్రాక్టర్‌ ఇష్టారాజ్యంగా పనులు చేయడం కలిపి ఈ దుస్థితికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు. పది కాలాలపాటు మన్నికగా ఉండాల్సిన రహదారి నెలల వ్యవధిల్లోనే శిథిలమవడంపై ప్రజలు ఆగ్రహం చేస్తున్నారు.

గోతులమయం

ప్రజల సొమ్ముతో నిర్మించిన రోడ్లు పనులు ఇలా గోతుల పాలవుతున్నా బాధ్యులపై చర్యలు లేకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రేపల్లె ప్రాంతంలో జరుగుతున్న పనుల నాణ్యతపై అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ప్రజల డబ్బుతో జరిగే అభివృద్ధి ఇలాగే నాసిరకంగా ఉంటే ఎలా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి పనులపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement