కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే | - | Sakshi
Sakshi News home page

కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సర్వే

Sep 9 2026 3:28 AM | Updated on Sep 9 2026 3:28 AM

జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌

బాపట్ల: కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని మినీ వీక్షణ సమావేశ మందిరంలో మంగళవారం కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు జిల్లా కోఆర్డినేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 24వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత కేసులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపి వైద్యులచే వ్యాధి నిర్ధారణ చేసి వెంటనే ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. అనంతరం పోస్టర్‌, కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ విడుదల చేశారు. సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ విజయమ్మ, జిల్లా లెప్రసీ ఎయిడ్స్‌ అండ్‌ టీబీ అధికారి డాక్టర్‌ వి సోమ్లానాయక్‌, జిల్లా న్యూక్లియస్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సాదిక్‌, జిల్లా సమన్వయ కమిటీ సభ్యులు, వైద్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణ భవిత పాఠశాల చిన్నారులకు

యూడీఐడీ ఇవ్వాలి

స్వర్ణ భవిత పాఠశాలలోని చిన్నారులకు యునిక్‌ డిజేబుల్‌ ఐడీ కార్డులు(యు.డి.ఐ.డి.) ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. స్వర్ణ భవిత పాఠశాలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్ని గదులను పరిశీలించారు. ఆధునికీకరణ పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. స్వర్ణ భవిత పాఠశాలలోని చిన్నారులకు ఐడీ కార్డులు నమోదు ప్రక్రియ తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌సింగ్‌, జోత్స్న, స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల కోఆర్డినేటర్‌ యశ్వంత్‌, ఆధార్‌ జిల్లా కోఆర్డినేటర్‌ అశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎనిమిది రోజుల్లోపు భూ సమస్య

పరిష్కరించాలి

భూమి సమస్యను ఎనిమిది రోజుల్లో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ తహసీల్దార్‌ను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను కలెక్టర్‌ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ప్రజాప్రతినిధులకు వచ్చిన దరఖాస్తులను స్వయంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్‌ శ్రీకారం చుట్టారు. చెంచు రామారావు దరఖాస్తు పరిశీలించారు. ఏ ప్రాంతంలో సమస్య, దరఖాస్తు చేసుకున్న తేదీ, ఇప్పటివరకు జరిగిన పురోగతి, పరిష్కరించాల్సిన గడువుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి నేరుగా దరఖాస్తుదారుడికి కలెక్టర్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. అదే క్రమంలో తహసీల్దార్‌తోనూ ఆయన మాట్లాడారు. ఆక్రమణలు తొలగించి భూమి యజమానికి భూమిపై హక్కు కల్పించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. నిజాంపట్నం మండలం దిండి గ్రామం సర్వే నంబర్‌ 426 లో పిన్ని బోయిన చెంచు రామారావు 3.12 ఎకరాల భూమిని మూడేళ్ల క్రితం కొనుగోలు చేశారు. సదరు భూమిని రామారావు సాగు చేసుకుంటుండగా ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి 96 సెంట్ల భూమిని ఆక్రమించారని తొలుత వీఆర్‌ఓకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారుడ్ని తొలగించలేకపోవడంతో చెంచు రామారావు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆశ్రయించారు. ఆక్రమణలు తొలగించి నా భూమి నాకు ఇప్పించాలని కలెక్టర్‌కు విన్నవించారు. ఆక్రమణదారునికి నోటీసులు ఇవ్వడం, ఏడు రోజుల్లో క్షేత్రస్థాయిలో విచారించి, ఎనిమిదో రోజున పరిష్కరిష్కరించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు.

ప్రకృతి వైపరీత్యాలు–మన బాధ్యత

ప్రకృతి వైపరీత్యాలు–మన బాధ్యత, బీచ్‌ల పరిశుభ్రత అంశాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌ కుమార్‌ తెలిపారు. దళిత బహుజన రిసోర్స్‌ సెంటర్‌ రూపొందించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్‌ మంగళవారం విడుదల చేశారు. ఎల్‌ నినో ప్రభావంతో వాతావరణ మార్పులు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కలెక్టర్‌ చెప్పారు. కార్యక్రమంలో రిసోర్స్‌ సెంటర్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ హేమలత, ఏరియా కోఆర్డినేటర్లు వి.భగవాన్‌దాస్‌, ఎన్‌ శ్రీలత, టి.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement