తెనాలి రూరల్: రైలు ఢీకొని వంట మాస్టర్ మృతి చెందిన ఘటన తెనాలి రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం జరిగింది. రైల్వే స్టేషన్ దక్షిణ క్యాబిన్ వద్ద పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో పట్టణ పాండురంగపేటకు చెందిన వంట మాస్టర్ ఎమ్మిటిశెట్టి నాగేశ్వరరావు(67) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి వద్ద ఎర్ర రంగు చేతి సంచి ఉంది. తొలుత గుర్తు తెలియని మృతదేహంగా భావించగా, రాత్రికి మృతుడి వివరాలు తెలిశాయి. ఎస్‌ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నగరంపాలెం: యూకే బ్రైటన్‌లో స్థిరపడిన ప్రముఖ తెలుగు సెలబ్రిటీ చెఫ్ కాంతికిరణ్ తమ్మా అరుదైన గౌరవా న్ని సొంతం చేసుకున్నా రు. గుంటూరు కొత్తపేటలో జన్మించారు. యూకే లో స్థిరపడ్డారు. బ్రైటన్‌న్‌లో ది స్పైస్ సర్క్యూట్ లిమిటెడ్ చెఫ్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన్ను ప్రతిష్టాత్మక బీఐహెచ్ స్పాట్‌లైట్ అవార్డ్స్ (2026)లో చెఫ్ ఆఫ్ ది ఇయర్ విభాగంలో ఫైనలిస్ట్‌గా ఎంపిక చేశారు. దేశవ్యాప్తంగా 3 వేలకుపైగా నామినేషన్లు వచ్చాయి. యూకేలో దక్షిణ భారత, ముఖ్యంగా తెలుగు వంటకాలు, ఆహార సంస్కృతికి అందిస్తున్న విశిష్ట సేవలకు లభించిన అరుదైన గుర్తింపుగా ఈ గౌరవాన్ని భావిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 12న బీఐహెచ్ స్పాట్‌లైట్ అవార్డ్స్– 2026 విజేతలను లండన్‌న్‌లోని క్వాగ్లినోస్‌లో ప్రకటించనున్నారు. తెలుగు వంటకాల ఘుమఘుమలను ప్రపంచానికి పరిచయం చేస్తున్న కాంతికిరణ్ తమ్మా చెఫ్ ఆఫ్ ది ఇయర్ ఫైనలిస్ట్‌గా నిలవడం తెలుగు వారి గర్వకారణంగా మారింది.
నగరంపాలెం: గుంటూరు ఆర్టీసీ బస్టాండ్‌లోని తిక్కన సమావేశ మందిరంలో ఐదు డిపోల డ్రైవర్లు, కండక్టర్లకు మంగళవారం శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా ప్రజా రవాణాధికారి డి.సామ్రాజ్యం మాట్లాడుతూ డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా మెలగాలని అన్నారు. సంస్థ ప్రతిష్ట డ్రైవర్లు, కండక్టర్లల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్ర శక్తి పథకం విజయవంతమైందని అన్నారు. తద్వారా మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని చెప్పారు. డ్రైవర్లు, కండక్టర్లు విధి నిర్వహణలో ఓర్పు, సహనంతో ఉండాలని సూచించారు. సురక్షితమైన ప్రయాణం ప్రయాణికులకు కల్పించాలని తెలిపారు.
మంగళగిరి రూరల్: యువ ఇంజినీర్ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన కళికవాయి వెంకట శ్యామ్ (22) రాజధానిలో ఈ– 14 రోడ్డు నిర్మాణం చేస్తున్న ఓ కంపెనీలో ఇంజినీరింగ్ విభాగంలో జూనియర్ సివిల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో ఈ–5 క్యాంప్ నుంచి రోజు విధుల కు హాజరవుతున్నాడు. మంగళవారం మంగళగిరి మండలం నవులూరులో క్రికెట్ స్టేడియం సమీపంలో నిర్మిస్తున్న ఈ–14 రోడ్డు నిర్మాణంలో భాగంగా డ్యూటీ చేస్తున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో కాంక్రీట్ మిక్సర్ వేయాల్సిన ప్రదేశం కాకుండా ముందుకు వెళ్లడంతో డ్యూటీలో ఉన్న ఇంజినీర్ శ్యామ్ వాహనాన్ని వెనక్కి పిలవడంతో డ్రైవర్ రివర్స్ గేర్‌లో వాహనాన్ని వెనక్కి తీసుకొచ్చారు. అక్కడే ఉన్న అతను డైరెక్షన్ మార్చుకో అని డ్రైవర్‌కి చెప్పేలోపు వాహనం శ్యామ్‌కు తగలడంతో అతను కింద పడిపోవడం అతడిపై టైర్ ఎక్కటం క్షణాల్లో జరిగిపోయింది. తోటి ఉద్యోగులు ఎయిమ్స్ హాస్పిటల్‌కి తరలించారు. అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు.
సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా ఇరువురికి తీవ్ర గాయాలైన ఘటన పట్టణంలోని అచ్చంపేటరోడ్‌లో పట్టణ శివారులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామానికి చెందిన ఆదిమూలపు దివ్య, భర్త రాంబాబు ద్విచక్ర వాహనంపై సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో పట్టణంలోని అంబేడ్కర్‌నగర్‌కు చెందిన షేక్ సిద్ధిక్ స్కూటీపై పాకాలపాడు వైపు వెళుతుండగా రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఆదిమూలపు దివ్య(35) తలకు బలమైన గాయం కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. భర్త ఆదిమూలపు రాంబాబుకు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అలాగే షేక్ సిద్ధిక్ తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో ఇరువురు క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. సిద్ధిక్‌కు 15 కుట్లు పడగా పరిస్థితి విషమంగా మారింది.పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.


