బాపట్ల టౌన్: ఆర్టీసీని కాపాడుకోవడానికి ఉద్యోగులు కార్మికులు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా నెల్లూరు–2 డిపో పరిధిలో కొనసాగుతున్న దీక్షలకు మద్దతుగా మంగళవారం బాపట్ల కొత్త బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కార్యదర్శి తిరుమలరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయొద్దని కోరుతూ ప్రజాప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా బాపట్లలో ఈ దీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను పరిరక్షించేందుకు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నట్లు తెలిపారు. దీక్షలో జిల్లా కార్యదర్శి తిరుమలరెడ్డితోపాటు జిల్లా అధ్యక్షులు నారాయణ, జిల్లా కోశాధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఎస్.యోగానంద్, సీఐటీయూ బాపట్ల నాయకులు కె.శరత్ కూర్చున్నారు. దీక్ష శిబిరాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు సీహెచ్ గంగయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు వై. భాస్కరరావు, సీఐటీయూ సీనియర్ నాయకులు కె.నాగేశ్వరరావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు సత్యనారాయణలు ప్రారంభించారు సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వసంతరావు, అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రేఖ ఎలిజిబెత్, ఎల్‌ఐసీ జిల్లా నాయకులు రవికిరణ్, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు శ్రీనివాస్, చారి దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం దీక్ష శిబిరంలో పాల్గొన్న వారికి నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు.
ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి బి.తిరుమలరెడ్డి


