● 1.3 కిలోల గంజాయి స్వాధీనం ● వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్ధనరావు
తెనాలిరూరల్: గంజాయి విక్రయాలు, వినియోగానికి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టయింది. తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి 1.3 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను డీఎస్పీ బి.జనార్ధనరావు వెల్లడించారు. నందివెలుగు జంక్షన్ వద్ద బ్రిడ్జి కింద గంజాయి విక్రయాలు, తాగుతున్నట్లు అందిన సమాచారంతో సోమవారం సాయంత్రం తెనాలి రూరల్ పోలీసులు దాడులు నిర్వహించారు. తెనాలి రూరల్ సీఐ షేక్ నాయబ్ రసూల్, ఎస్‌ఐ కె.ఆనంద్, డెప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్, వీఆర్వోలు గుంపెన నాగరాజు, కొత్త జార్జి థామస్ సమక్షంలో దాడులు చేశారు. అబ్దుల్ కరీమ్(కొల్లిపర), అమిరె ఆనంద్ కిషోర్ అలియాస్ చోటు(కొల్లిపర), షేక్ సాధిక్(తెనాలి), కోలా రత్నరాజు(తెనాలి), దేవరకొండ మను శివశంకర్ అలియాస్ బబ్లూ(తెనాలి), బత్తెన అజయ్‌కుమార్(తెనాలి), రెడ్డి సాయికుమార్(తెనాలి) గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారించగా గంజాయిని గుంటూరుకు చెందిన వ్యక్తుల నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. వీరి సమాచారంతో మంగళవారం ఉదయం గుంటూరు చుట్టుగుంట ప్రాంతంలో దాడి చేసి ప్రధాన సప్లయర్లుగా పేర్కొన్న ఆరేటి నవీన్‌న్, షేక్ షఫీలను అరెస్టు చేశారు. తెనాలి ప్రాంతానికి గంజాయి సరఫరా చేస్తున్న ముఠా లింక్‌ను ఛేదించారు. అరెస్టయిన వారిలో పలువురిపై గతంలోనూ వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో కేసులు ఉన్నట్లు డీఎస్పీ వెల్లడించారు. కొందరిపై దొంగతనాలు, ఎన్‌డీపీఎస్ కేసులు ఉండగా, షేక్ షఫీపై ఎన్‌న్‌డీపీఎస్, ఆయుధాల చట్టం, హత్య, దాడి తదితర కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచగా రిమాండ్‌కు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్‌ఐ కె. ఆనంద్, కొల్లిపర ఎస్‌ఐ ప్రసాద్‌తో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్ధనరావు అభినందించారు. సమావేశంలో తెనాలి రూరల్ సీఐ నాయబ్ రసూల్, ఎస్‌ఐ కె.ఆనంద్, కొల్లిపర ఎస్‌ఐ ప్రసాద్ ఉన్నారు.


