● వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ పద్మావతి ● సీఐని ఉద్యోగం నుంచి తొలగించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
రేపల్లె: చీరాల పట్టణంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వృద్ధురాలిపై సీఐ ప్రవర్తించిన తీరు అత్యంత బాధాకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సజ్జ పద్మావతి పేర్కొన్నారు. సమన్వయకర్త నాగమోహన్‌కృష్ణ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడారు. వృద్ధురాలు అని కూడా చూడకుండా సీఐ అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ అమానుషంగా ప్రవర్తించడం సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి నెలకొందన్నారు. పోలీస్ అధికారులే ఇలా ప్రవర్తించడం శాఖకు మాయని మచ్చగా మారిందని అన్నారు.‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ విధానమని చెబుతూనే సామాన్యులపై ఆధిపత్య ధోరణి ప్రదర్శించడం బాధాకరమని పేర్కొన్నారు. మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, పోలీస్ వ్యవస్థలోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. తన తల్లి వయసు ఉన్న వృద్ధురాలిపై సీఐ ప్రవర్తించిన తీరు మాటల్లో వర్ణించలేనిదని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా సీఐను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసు వ్యవస్థపై ప్రజల నమ్మకం నిలబడాలంటే ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని ఆమె కోరారు.


