కర్లపాలెం: ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల సంఘం అధ్యక్షుడు గొట్టిముక్కల గాంధీ భగవాన్‌రాజు కోరారు. కర్లపాలెం గ్రామదేవత పెద్దింటమ్మ అమ్మవారి కల్యాణ మండపంలో ఆదివారం బాపట్ల జిల్లా స్థాయి ఆక్వా రైతుల సమావేశం నిర్వహించారు. భగవాన్‌రాజు మాట్లాడుతూ ఆక్వా రైతులకు కరెంటు యూనిట్‌కి రూ.1.50లకు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని కోరారు. ఎన్నో కష్టాలకోర్చి రైతులు పెంచిన రొయ్యలకు ప్రభుత్వం కౌంటుల వారీగా సరైన గిట్టుబాటు ధర అందించాలని, మేత ధరలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతులు సంఘాలుగా ఏర్పడి సొసైటీల ద్వారా సబ్సిడీ రుణాలు తీసుకుని వినియోగించు కోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, మండలాలలో ఆక్వా రైతుల యూనియన్‌లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. ఆక్వా రైతులందరూ ఐకమత్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన చెప్పారు. సమావేశంలో ఆక్వా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈదర కుమార్, సభ్యులు రామలింగరాజు, సత్తిబాబురాజు, ఆనందగజపతి రాజు, రైతులు మోపిదేవి శ్రీనివాసరావు, ఐజాక్, కాకర్లపూడి భాస్కరరాజు, హరనాధరాజు, చుక్కా శ్రీనివాసరావు, అక్కల రమణారెడ్డి, పల్లప్రోలు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఆక్వా రైతుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు భగవాన్‌రాజు


