కొల్లూరు: ఇండో–నేపాల్ అంతర్జాతీయ చాంపియన్‌షిప్ పోటీలలో కొల్లూరు విద్యార్థులు దేశం తరపున ప్రాతినిధ్యం వహించి పతకాలు పంట పండించారు. ఈనెల 19 నుంచి 21 వరకు నేపాల్‌లోని పోక్రాలో స్కేటింగ్‌లో ఆరు విభాగాలలో నిర్వహించిన పోటీలలో కొల్లూరు ఫోర్ ప్రంట్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. దేశ వ్యాప్తంగా 12 మంది క్రీడాకారులు దేశానికి ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం దక్కగా, వారిలో కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్‌లు ఎంపికయ్యారు. అండర్–14 విభాగంలో నిర్వహించిన ఏరో స్కేట్‌బాల్ పోటీలలో కొల్లూరుకు చెందిన గరిక రిత్విక్, మునిపల్లి పునీత్‌లు రాణించి గోల్డ్ మెడల్స్ సాధించారు. వ్యక్తిగత విభాగంలో నిర్వహించిన పోటీలలో రిత్విక్ మెరుగైన ప్రతిభను కనబర్చి జిగ్‌జాగ్ స్కేటింగ్‌లో గోల్డ్ మెడల్, స్కేట్ వాక్‌లో సిల్వర్, 1 మినిట్ స్కేటింగ్ రేస్‌లో సిల్వర్ పతకాలతో మెరిశాడు. కొల్లూరుకు చెందిన రిత్విక్, పునీత్‌లు ఐదు పతకాలను సాధించగా, వ్యక్తిగతంగా పునీత్‌కు గోల్డ్ మెడల్, రిత్విక్‌కు రెండు బంగారు, రెండు వెండి పతకాలు లభించాయి. అరకొర వసతుల నడుమే అంకిత దీక్షతో స్కేటింగ్ నేర్చుకొని దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించిన క్రీడాకారులను, వారి తల్లిదండ్రులను పలువురు అభినందించారు.


