నర్సింగ్‌ విద్యపై మరకలు | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ విద్యపై మరకలు

Aug 24 2026 6:51 AM | Updated on Aug 24 2026 6:51 AM

● గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి ఆవరణలోని నిబంధనల ప్రకారం నర్సింగ్‌ స్కూల్‌ లేదు. స్కూల్‌ను పడగొట్టి నాట్కో క్యాన్సర్‌ వార్డు నిర్మాణం చేశారు. విద్యార్థుల ఇబ్బందులను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. ● గోరంట్లలోని ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌లో భోజనం ప్రైవేటు వ్యక్తుల నిర్వహణలో ఉండి, ఇష్టానుసారంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులున్నాయి. కాలేజ్‌లోని బోధనా సిబ్బందే కొంత మంది బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థుల వద్ద పలు రకాల పేర్లతో ప్రతి ఏడాది వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వసూళ్ల పర్వం ప్రతి ఏడాది అడ్మిషన్‌ల సమయంలో కొనసాగుతూనే ఉంది. ● ప్రభుత్వ పాఠశాలల్లో, కాలేజీల్లో పరిస్థితీ ఇలా ఉంటే, ప్రైవేటు నర్సింగ్‌ కాలేజీల్లో, పాఠశాలల్లో తీవ్రంగా సమస్యలు ఉన్నాయి.

కనీస వసతులు లేకుండానే నర్సింగ్‌ కాలేజ్‌ల నిర్వహణ తూతూమంత్రంగా అధికారుల పనితీరు వసతులు లేక ఇబ్బందులు పడుతున్న నర్సింగ్‌ విద్యార్థులు

నిబంధనలు ఏమంటే...

గుంటూరు మెడికల్‌: నర్సింగ్‌ విద్య అంధకారంలోకి వెళ్తోంది. సేవా గుణంలో చాలా మంది నర్సింగ్‌ వృత్తిని ఎంచుకుంటారు. కనీస వసతులు లేని నర్సింగ్‌ కాలేజ్‌, స్కూల్‌ భవనాలు, అరకొర అధ్యాపక బృందం, చాలీచాలనీ భోజన సదుపాయంతో నిత్యం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. కష్టాల నడుమ విద్య కొనసాగిస్తున్నారు. జైళ్లను తలపించే హాస్టల్‌ ప్రాంగణాలు, రోగాల బారిన పడుతున్నా చదువును నెట్టుకొస్తున్నారు. అవినీతి మరకులు అంటాయి.

సమస్యల సుడిగుండంలో...

సమస్యలతో విద్యార్థులు రోడెక్కారు. ఇటీవల గుంటూరు మారుతీనగర్‌లోని డాక్టర్‌ సౌమ్య కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో బీఎస్సీ విద్యార్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం సంచలనం కలిగింది. బోధనా సిబ్బంది లేరని, ప్రిన్సిపాల్‌ ఎవరో కూడా తాము చూడలేదని, కరస్పాండెంట్‌ తీవ్రంగా తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, చదువుకునే సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో క్లీనికల్‌ విధులు చేయిస్తూ డబ్బులు కూడా వారే తీసుకుంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. హాస్టల్స్‌లో భోజనం సక్రమంగా పెట్టరని ఆరోపించారు.

తనిఖీలు ఎవరూ చేస్తారంటే...

జిల్లా వ్యాప్తంగా ఉన్న 34 నర్సింగ్‌ కాలేజీలు, 38 నర్సింగ్‌ స్కూల్స్‌ ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌, గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయం, గోరంట్ల ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజ్‌, జీజీహెచ్‌ నర్సింగ్‌ స్కూల్‌కు చెందిన పలువురు బోధనా సిబ్బంది, అధికారులు, కార్యాలయ ఉద్యోగులు, ప్రతి ఏడాది నర్సింగ్‌ స్కూల్‌, కాలేజ్‌ తనిఖీలు నిర్వహించాలి. అయితే తనిఖీలకు వెళ్లి అన్ని సవ్యంగా ఉన్నాయంటూ రిపోర్టులు ఇవ్వడం సాధారణమే. యాజమాన్యాలు అనుమతులు తెచ్చుకుని కళాశాలలు, స్కూల్స్‌ నిర్వహిస్తూ నర్సింగ్‌ విద్యార్థులను ముప్ప తిప్పలు పెట్టడం పరిపాటిగా మారింది. వీరు సక్రమంగా క్లీనికల్‌ విధులకు హాజరు కాకపోయినా, పరీక్షల్లో చూసిరాతలు రాస్తూ పట్టుబడినా, ఎలాంటి చర్యలు తీసుకున్న పరిస్థితి లేదు.

ఇండియన్‌ నర్సింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నర్సింగ్‌ కళాశాలలు, స్కూల్స్‌లో పలు రకాల సదుపాయాలు ఉండాలి. టీచింగ్‌ బ్లాక్‌లో లెక్చరర్‌ హాలు.. నర్సింగ్‌ ఫౌండేషన్‌ ల్యాబ్‌, కంప్యూటర్‌ ల్యాబ్‌, ప్రి క్లినికల్‌ సైన్స్‌ ల్యాబ్‌, మల్టీపర్పస్‌ హాలు, గ్రంథాలయం, గైనిక్‌ అండ్‌ పీడియాట్రిక్స్‌ ల్యాబ్‌, ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, బోధనా సిబ్బందికి ప్రత్యేక గదులు ఉండాలి. అన్ని విభాగాలకు 23 వేలకు పైగా స్క్వేర్‌ ఫీట్‌ ఏరియాలో నిర్మాణాలు నిర్మించాలి. హాస్టల్‌ ప్రాంగణంలో విజిటర్స్‌ రూము, రీడింగ్‌ రూము, రిక్రియేషన్‌ రూము, డైనింగ్‌ హాలు, కిచెన్‌ అండ్‌ స్టోర్‌, విద్యార్థులు ఉండే గదులు, అన్ని విభాగాలను మూడు వేల స్క్వేర్‌ ఫీట్స్‌పైగా ఉన్న ఏరియాల్లో ఉండాలి. ప్రొఫెసర్‌ అర్హత కలిగిన ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ అర్హత కలిగిన రీడర్‌, లెక్చరర్లు, 19 మంది ట్యూటర్లు విధుల్లో ఉండాలి. టీచర్‌, స్టూడెంట్‌ రేషియో 1:10 ఉండాలి. ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌కు నర్సింగ్‌లో మాస్టర్‌ డిగ్రీతో పాటు, పదేళ్ల అనుభవం ఉండాలి. రీడర్‌కు ఏడేళ్లు, లెక్చరర్‌కు మూడేళ్లు, ట్యూటర్‌కు ఏడాది అనుభవం ఉండాలి. వాస్తవానికి, కళాశాలలు, పాఠశాలల్లో అవేమీ కనిపించడం లేదు. మరో వైపు ప్రతి ఏడాది వైద్య అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. యాజమాన్యాలు ఇస్తున్న తాయిలాలు అందుకుంటూ తప్పుడు నివేదికలు ఇస్తుండడంతో జిల్లాలో నర్సింగ్‌ విద్య మేడిపండు చందంగా తయారైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement