సెల్‌ఫోన్ ఫ్లాష్‌తో
జూడాల నిరసన
గుంటూరు మెడికల్: గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ డాక్టర్స్ చేస్తున్న సమ్మె ఆదివారానికి 14వ రోజుకు చేరింది. జీజీహెచ్, గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన పీజీ వైద్యులు, రెసిడెంట్లు హౌస్‌సర్జన్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద బైఠాయించి శాంతియుత నిరసన కొనసాగించారు. సమ్మెలో భాగంగా 15 మంది పీజీ రెసిడెంట్లు స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్స్ సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ తాము లేవనెత్తిన సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు తమను తదుపరి చర్చలకు ఆహ్వానించలేదని, ఎలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పారు. సమ్మెకు సంబంధించిన అంశాలతో డంబ్ షరాడ్స్ కార్యక్రమం నిర్వహించారు. జూడాల్లో ఒక బృందం తాము ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్లు, సవాళ్లకు సంబంధించిన పదాలు, అంశాలను హావభావాల ద్వారా వ్యక్తపరచగా, మరో బృందం వాటిని గుర్తించే విధంగా కార్యక్రమం నిర్వహించారు. సెల్‌ఫోన్ ఫ్లాష్‌లు వెలిగించి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేకపోయినప్పటికీ తమ కార్యక్రమాలన్నీ శాంతియుతంగా, క్రమశిక్షణతో, న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా చేస్తున్నట్లు నేతలు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి అర్థవంతమైన చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం తక్షణమే చర్చలు ప్రారంభించి, సమస్యలను త్వరితగతిన, స్నేహపూర్వక పరిష్కారం చూపాలని జూడా నేతలు కోరారు. కార్యక్రమంలో జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు వైద్యులు ఈశ్వరశంకర్, ప్రసన్న ఆదిలక్ష్మి, విగ్నేష్‌ఆపతి, జగదీష్ గాదె, అనురాగ్, రాధిక, సందీప్‌కుమార్, సాయిప్రదీప్ పాల్గొన్నారు.


