మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి
బాపట్ల: కవి నిబ్బనుపూడి లక్ష్మణ మురళీధరరావు నిస్వార్థ సేవాభావం, పేదల పక్షాన నిలిచే ధైర్యం, వృత్తిపట్ల నిబద్ధత నేటి తరానికి ఆదర్శమని మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, ప్రముఖ న్యాయవాది, రంగస్థల కళాకారుడు, కవి నిబ్బనుపూడి లక్ష్మణ మురళీధరరావు శతజయంతి వేడుకలు బాపట్లలో ఘనంగా నిర్వహించారు. చీలురోడ్డులోని కోన భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు ఆయన సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకున్నారు. కోన మాట్లాడుతూ బాపట్ల ప్రత్యేకతను, న్యాయవాదుల సేవా వారసత్వాన్ని కాపాడేందుకు అందరూ కృషి చేయాలని, బాపట్ల అభివృద్ధి కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు, రిటైర్డ్ లెక్చరర్ ఇన్ పాలిటిక్స్ జి.శాంతారాం మాట్లాడుతూ మురళీధరరావు అన్యాయానికి గురైన వారికి అండగా నిలిచిన గొప్ప మానవతావాది, ధైర్యవంతుడైన న్యాయవాది అని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలోనూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆయన పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు విన్నకోట సత్యప్రసాద్ మాట్లాడుతూ మురళీధరరావు న్యాయవాద వృత్తిలో ఉన్నత నైతిక విలువలకు ప్రతీకగా నిలి చారని అన్నారు. సివిల్, క్రిమినల్ న్యాయశాస్త్రాల్లో సమాన పరిజ్ఞానంతో రాణించిన అరుదైన న్యాయవాదిగా ఆయనను స్మరించారు. యువ న్యాయవాదులను ప్రోత్సహించే విశాల హృదయం ఆయన సొంతమన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు శాంతకుమార్ మాట్లాడుతూ మురళీధరరావు నిబద్ధత, వ్యక్తిత్వం, క్రమశిక్షణ నేటి సమాజానికి ఎంతో అవసరమన్నారు. విలువలు క్షీణిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన జీవితం, న్యాయవాద వృత్తిలో పాటించిన నైతిక విలువలు యువ న్యాయవాదులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞను, వివిధ రంగాల్లో చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా మన్నే శ్రీనివాసరావు, కోన రఘుపతి, పువ్వాడ ఏకమేశ్వరరావు, మురళీధరరావు కుమారులు లక్ష్మీనరసింహారావు, శ్రీహరి ప్రకాష్, సాయికృష్ణ, అజయ్ కుమార్ తదితర కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యాయవాదులు, సాహితీవేత్తలు, కళాకారులు, కుటుంబ సభ్యులు, సీనియర్ సిటిజన్లు, మిత్రులు పాల్గొని మురళీధరరావుకు ఘన నివాళులర్పించారు.


