ఇదేం అబద్ధాల రోగం? | - | Sakshi
Sakshi News home page

ఇదేం అబద్ధాల రోగం?

Aug 23 2026 1:28 AM | Updated on Aug 23 2026 1:28 AM

ధూళిపూడి వైద్యశాల అభివృద్ధికి రెండుసార్లు శంకుస్థాపన అప్పటికీ మూలకు చేరిన శిలాఫలకాలు వసతులు లేక అవస్థలు పడుతున్న రోగులు

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం

నగరం: ధూళిపూడి పీహెచ్‌సీ అభివృద్ధికి 2017 డిసెంబర్‌ 17వ తేదీన అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ భూమి పూజ చేశారు. ఆరు నెలల్లోనే భవన నిర్మాణ పనులు పూర్తిచేసి వైద్య సేవలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ 2024 ఆగస్ట్‌ 23వ తేదీన ప్రస్తుత రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ మరోసారి భూమి పూజ చేశారు. ఆరు నెలల్లో భవన నిర్మాణ పనులు పూర్తి చేసి వైద్యసేవలు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. ఏళ్లు గడుస్తున్నా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు.

నగరం మండలం ధూళిపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల వైద్యశాల (సామాజిక ఆరోగ్యకేంద్రం)గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. 2017లో రూ.2 కోట్లు మంజూరు చేయగా అప్పటి మంత్రి శంకుస్థాపన చేశారు. కానీ పనులు జరగలేదు. 2024లో రూ.6 కోట్లు మంజూరు చేశారు. అప్పుడు మరోసారి మంత్రి అనగాని శంకుస్థాపన చేశారు. నేటికీ అతీగతీ లేదు. మోసం చేయడానికే మంత్రులు హామీలు గుప్పిస్తున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.

నిబంధనలు అమలయ్యేనా..

ధూళిపూడిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేసేందుకు నిబంధనలు అడ్డంకిగా ఉన్నట్లు తెలిసింది. ధూళిపూడికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రేపల్లెలో 100 పడకల ఆస్పత్రి ఉంది. అదే విధంగా ఎనిమిది కిలో మీటర్ల దూరంలోని నగరంలో 30 పడకల ఆస్పత్రి ఉంది. ధూళిపూడిలో 30 పడకల ఆస్పత్రికి నిబంధనలు అడ్డువస్తాయని సమాచారం. ఈ విషయం తెలిసి కూడా మంత్రులు శంకుస్థానలు చేసి మభ్యపెడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సిబ్బంది నియామకం ఏదీ?

సామాజిక ఆరోగ్య కేంద్రంగా అప్‌గ్రేడ్‌ కావాలంటే ముందుగా సరిపడా సిబ్బంది నియామకం చేపట్టాలి. సీహెచ్‌సీకి అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్‌లు ఎనిమిది మంది, దంత వైద్య నిపుణులు ఒకరు, ఒక హెడ్‌ నర్స్‌, ఆరుగురు స్టాఫ్‌ నర్సులు, ఇద్దరు ల్యాబ్‌ టెక్నిషీయన్‌లు, ఇద్దరు ఫార్మాసిస్ట్‌లు, ఒక జూనియర్‌ అస్టిసెంట్‌, నైట్‌ వాచ్‌మెన్‌లు, పారిశుద్ధ్య సిబ్బంది మొత్తం 31 మంది అవసరం ఉంది. సీహెచ్‌సీకి ముందుగా సిబ్బందిని నియమించాలి. కానీ ఇంతవరకు ఒక్కరిని కూడా నియమించిన దాఖలాలు లేవు.

పీహెచ్‌సీ ఆప్‌గ్రేడ్‌కు అవసరమైన సిబ్బంది నియామకం జరగలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ధూళిపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చేందుకు అవసరమైన అన్ని పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ పద్మావతి,

జిల్లా వైద్యశాల సమన్వయ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement