కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్
బాపట్ల: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల నమోదు, జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన సమీక్షలో ప్రత్యేక డ్రైవ్ పురోగతిని పరిశీలించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా నోటీసులు జారీ చేసిన ప్రతి ఓటరు నుంచి స్పందనను తప్పనిసరిగా నమోదు చేసి, వివరాలను ఎన్నికల వెబ్‌సైట్‌లో వెంటనే నవీకరించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. విధుల పట్ల అలసత్వం వహించారదని హెచ్చరించారు. శనివారం నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ పురోగతిపై ఆదివారం ఉదయం 8 గంటల నుంచి నేరుగా సమీక్ష నిర్వహించనున్నారు. ఆర్డీఓ లవన్న, ముగ్గురు ఆర్డీవోలు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్‌వోలు, డీపీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రహదారులపై గుంతలు త్వరగా పూడ్చాలి
జిల్లాలో ప్రధాన రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రహదారులపై గుంతల కారణంగా ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత క్రమంలో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్యాచ్ వర్క్ పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందుగా పనులు చేపట్టాలని ఆదేశించారు. పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కొత్త రహదారులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో ఆర్‌అండ్‌బీ ఈఈ వేణుగోపాల్, డీఈఈలు, పంచాయతీరాజ్ శాఖ డీఈఈ సత్యనారాయణ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ అండ్ బీ ఏఈలు, పంచాయతీరాజ్ ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
కట్న నిషేధ చట్టం పటిష్ట అమలుకు ఆదేశం
కట్న నిషేధ చట్టం–1961ను జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కట్న వేధింపులు, కట్న మరణాల నివారణకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. బాపట్ల కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం నిర్వహించిన కట్న నిషేధ చట్టం అమలు–జిల్లా స్థాయి సలహా మండలి సమీక్షా సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. కట్న వేధింపులకు సంబంధించిన ఐదు కేసుల్లో మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేశారు. సమావేశంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ రాధామాధవి, సీఐ సుబ్బారావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సీహెచ్ సారఽథి, రవి ప్రదీప్, పుష్ప దేవి, రాజారావు తదితరులు పాల్గొన్నారు.


