జూనియర్ డాక్టర్ల సమ్మె నేపథ్యంలో టీడీపీ సర్కారు సమస్య పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో పేద రోగులకు వైద్య సేవలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరు జిల్లాలకు ఆరోగ్య ప్రదాయినిగా ఉన్న గుంటూరు జీజీహెచ్‌లో వైద్య సేవలు స్తంభించిపోయాయి. రోగులు లేక వార్డులన్నీ వెలవెలబోతున్నాయి. నెల క్రితం వరకు బెడ్‌లు ఖాళీ లేని పరిస్థితి ఉంది. నేడు ఖాళీ బెడ్‌లు దర్శనమిస్తున్నాయి. రోజూ వేలాది మంది రోగులకు ఉచితంగా వైద్య సేవలు అందించే జీజీహెచ్‌లో జూడాల సమ్మెతో వైద్య సేవలు నిలిచిపోయినా టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. పాలకుల తీరుపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


