గుంటూరు లీగల్: న్యాయవాదులు వృత్తితో పాటు క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండటం సమాజానికి ఎంతో శ్రేయస్కరం అని, తద్వారా యువతకు వారు మార్గదర్శకులుగా నిలుస్తారని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి సూచించారు. శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో క్రీడాకారులను, విజేతగా నిలిచిన జట్టును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. క్రీడలు న్యాయవాదుల్లో స్నేహభావం, క్రమశిక్షణ, జట్టు స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధిర నాగేశ్వరరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీ కుప్పల హనుమంతరావు, బార్ కౌన్సిల్ మెంబర్ వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి, శాతరాసి ఏడుకొండలు, మైలా బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్‌కు షీల్డు బహూకరించిన పులి ప్రత్యూషను, క్రీడాకారులను ప్రోత్సహించిన పలువురు న్యాయవాదులను అభినందించారు.
నరసరావుపేట: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల కోసం కలెక్టరేట్లో ప్రత్యేకంగా శనివారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదికలో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ 25 అర్జీలు స్వీకరించారు. వీటిలో ఎస్సీల సమస్యలపై 11, ఎస్టీలౖ నుంచి, దివ్యాంగుల నుంచి ఏడు చొప్పున అర్జీలు వచ్చాయి. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను జేసీ ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి అర్జీని పరిశీలించి, సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యతనిస్తూ సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశామని, సేవలు పొందిన అనంతరం ఈ కోడ్ స్కాన్ చేసి అభిప్రాయాలు నమోదు చేయాలన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీల భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ కోరారు. శనివారం కలెక్టరేట్లో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్లో బాధితులతో కలిసి డీఆర్ఓ కె.అద్దెయ్యకు వినతిపత్రం సమర్పించారు. విజయపురిసౌత్, నాగార్జునసాగర్, గుళ్లపల్లి భూ సమస్యల బాధితులు ఉన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లాలోని వివిధ మండలాల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న క్లస్టర్ సమావేశాల నిర్వహణ తీరుతెన్నులను శనివారం పాఠశాల విద్య ఆర్జేడీ బి.లింగేశ్వర రెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీమ్ బాషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్న నారాకోడూరు, దుగ్గిరాల, అంగలకుదురు, నూతక్కిలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలతోపాటు తెనాలిలోని కేఎస్ఎం హైస్కూల్, మంగళగిరిలోని పీఎం శ్రీ హైస్కూల్‌ను సందర్శించారు. ఉపాధ్యాయులు తమ బోధనా అనుభవాలను పరస్పరం పంచుకోవడం, ఉత్తమ బోధనా పద్ధతులను అవలంబించడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపరచడం వంటి పలు అంశాలను వారు పరిశీలించారు.
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 53.50 అడుగులకు చేరింది. ఇది 175.06 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి ఎస్ఎల్బీసీకి 1,500 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 1,500 క్యూసెక్కులు విడుదల అవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌కు 20 వేల క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.


