బాపట్ల: బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన జిల్లాస్థాయి యోగా పోటీలను నిర్వహిస్తునట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కళ్ళం హరినాథరెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎకో హౌస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కళ్ళం మాట్లాడారు. ఈనెల 23వతేదీన పోటీలు నిర్వహిస్తున్నామని, 8 ఏళ్ల నుంచి 60సంవత్సరాలపై బడిన వారితో సహా ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చని తెలిపారు. 23వ తేదీ ఉదయం 9గంటల నుంచి 4గంటల వరకు ఈపోటీలు జరుగుతాని ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలన్నారు. అసోసియేషన్ కార్యదర్శి అల్లాడి రవికుమార్, గౌరవ అధ్యక్షులు డాక్టర్ శరత్‌బోస్, గౌరవ సలహాదారులు డాక్టర్ సిద్ధార్థ, జిల్లా కన్వీనర్ పిన్నిబోయిన శ్రీమన్నారాయణ, ఈసీ సభ్యులు మైలా వెంకట సాయికుమార్ తదితరులు ఉన్నారు.
రాబోయే రోజుల్లో చలపతి
వర్సిటీలో ఆధునిక వసతులు
తాడికొండ: చలపతి యూనివర్సిటీ విద్యార్థుల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని ఏపీ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ కె.మధుమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు. చలపతి యూనివర్సిటీలో మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆధునిక వసతులతో కూడిన విద్యనందిస్తూ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్ ప్రాధాన్యం, పారిశ్రామిక అనుబంధ కరిక్యులమ్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. 18 సంవత్సరాలకు యూనివర్సిటీగా అవతరించడం అభినందనీయమన్నారు. ఏఎన్‌యు రెక్టార్ ప్రొఫెసర్ ఆర్.శివరాం ప్రసాద్ మాట్లాడుతూ ఆశలు, ఆకాంక్షలతో పిల్లల భవిష్యత్ ఉన్నతంగా ఉండాలంటే చలపతిలో ప్రవేశం మంచి నిర్ణయం అన్నారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. చలపతి చాన్స్‌లర్ డాక్టర్ వైవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఆశలు, ఆశయాలు, సదుద్దేశంతో విద్యార్థుల తల్లిదండ్రులు తమ వర్సిటీని ఎంచుకున్నందుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రొ.ఛాన్స్‌లర్ వై.సుజిత్ కుమార్, రిజిస్ట్రార్ డాక్టర్ నాదెండ్ల రామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.నాగ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
విద్యార్థి ఉద్యమాలపై
నిర్బంధం ఆపాలి
లక్ష్మీపురం: విద్యార్థి ఉద్యమాలపై నిర్బంధం ఆపాలని, విద్యా కార్పొరేటీకరణ, కేంద్రీకరణ వైపు తీసుకువెళ్లే నూతన విద్యావిధానాన్ని, ఎన్.టి.ఎను రద్దు చేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ విధ్యార్థి సంఘాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన దీక్షను బుధవారం నిర్వహించారు. ముందుగా విద్యార్థి సంఘం నాయకులకు పూల దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ.. విద్య గతంలో ఉమ్మడి జాబితాలో ఉండేదని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని కేంద్రీకరణ చేసి కేంద్రం చేతుల్లోకి తీసుకుని నూతన విద్యావిధానం ఎన్‌ఈపీని తీసుకువచ్చిందన్నారు. ఈ నేపధ్యంలోనే గతంలో రాష్ట్రాల వారీగా జరిగే ఎంసెట్ పరీక్షను కేంద్రమే నిర్వహిస్తూ ఎన్‌టీఏను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కేందుకు నిర్బంధాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. డి.వై.ఎఫ్.ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ వై.కృష్ణకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ గుంటూరు జిల్లా కన్వీనర్ షేక్ సమీర్‌లు మాట్లాడారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు రాజ్ కుమార్, కిరణ్ దాసరి,దుర్గాప్రసాద్ నాయక్ , మరియమ్మ, మనీ, యశ్వంత్, సాయి, జావిద్, యుగేందర్, శ్యామ్, చరణ్, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.


