గుంటూరు మెడికల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అంతర్గత యుద్ధం సాగుతోంది. జిల్లా వైద్య అధికారులు పరస్పరం లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒక జిల్లా వైద్య అధికారి అధిక మొత్తంలో మామూళ్లు తీసుకుంటున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. సదరు అధికారిపై విచారణ జరిపి క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంతో, సదరు అధికారి కోర్టుకు వెళ్లి తన సీటులో తాను కూర్చుంటున్నారు. తనపై చర్యలకు పాల్పడిన మరో వైద్య అధికారిపై జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నారని, తన డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలను సైతం భర్తీ చేసి, అందిన కాడికి దండుకుంటున్నట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో కీలకమైన ఇరువురు జిల్లా వైద్య అధికారులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుకు నిదర్శనంగా నిలిచింది.
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కొంతమంది సిబ్బంది డెప్యూటేషన్ పేరుతో మకాం వేసి, డబ్బులు వచ్చే సీట్లలో తిష్ట వేసి కూర్చుండిపోతున్నారు. జిల్లా కార్యాలయానికి వచ్చే పలు ఫైల్స్ క్లియరెన్స్‌కు అందిన కాడికి దండుకుంటూ, వైద్య అధికారులను ప్రసన్నం చేసుకుంటూ, డెప్యూటేషన్ ఉద్యోగులైనప్పటికీ రెగ్యులర్ ఉద్యోగులకంటే ఎక్కువ హవా సాగిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులను పక్కన కూర్చోబెట్టి, డెప్యూటేషన్ సిబ్బందికి, కాంట్రాక్టు ఉద్యోగులకు కీలక సీట్లు అప్పగించి వసూళ్లకు తెరతీస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాల విభజన అనంతరం ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమలులోకి వచ్చినప్పటికీ, డెప్యూటేషన్ ఉద్యోగులు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఉండిపోయారు. వారి హవాకు రెగ్యులర్ ఉద్యోగులు సైతం మిన్నకుండిపోతున్నారు. ఉన్నతాధికారులే వీరిని ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు ఇతర ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి.
సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మిపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేస్తూ జిల్లా క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో దాసరి శ్రీనివాసులుపై సైతం పలువురు ఉద్యోగులు లిఖితపూర్వకంగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రిక్రూట్‌మెంట్ విషయంలో, పోస్టుల కేటాయింపుల్లో అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారంటూ ఆధారాలతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయనపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు. అయితే జిల్లా స్థాయి అధికారులు తనను సరెండర్ చేసే అధికారం లేదంటూ కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని, అదే సీటులో కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం సదరు అధికారిపై డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కార్యాలయానికి ఫైల్ ప్రొసీడింగ్ చేయాల్సిన కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఎందుకు మిన్నకుండిపోతున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ కారణంగా జిల్లా వైద్య అధికారుల మధ్య వార్ నడుస్తున్నట్లు కింది స్థాయి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలోనే జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణంపై సైతం ఏపీ ఎన్జీవో నేతలు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సదరు అధికారి కార్యాలయంలో ఎప్పుడూ అందుబాటులో ఉండరని, కార్యాలయ ఫైల్స్ అన్నీ పెండింగ్‌లో పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కీలకమైన పోస్టుల్లో ఉన్న ముగ్గురు జిల్లా వైద్య అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వరుసగా వెళ్లడం గమనార్హం.
కింది స్థాయిలోనూ అదే తీరు..
అధికారులే ఇలా అవినీతి ఆరోపణలతో మునిగితేలుతుంటే, కింది స్థాయి సిబ్బంది కూడా వారికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోగ్య కేంద్రాల్లో వైద్య అధికారులు విధులకు హాజరు కాకుండా సొంత ప్రాక్టీస్‌లో మునిగితేలడం, ప్రభుత్వ జీతాలు తీసుకోవడం, దానికి ఉన్నతాధికారులు వత్తాసు పలకడం లాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీహెచ్‌సీ వైద్య అధికారులు సక్రమంగా విధుల్లో లేకపోవడం వల్లే ఇతర వైద్య సిబ్బంది సైతం మొక్కుబడిగా విధులకు హాజరవుతూ, వైద్య ఆరోగ్య శాఖను ప్రభుత్వం నిర్దేశించిన పథకాల అమలులో చిట్టచివరన నిలిపారు.
కార్యాలయంలో పాతుకుపోయి..
ఫిర్యాదుల పరంపర
జిల్లా వైద్య అధికారుల
పరస్పర ఫిర్యాదులు
అవినీతి బాగోతంపై విస్తృతంగా చర్చ
కిందిస్థాయి సిబ్బందిపైనా ఆరోపణలు
డీఎంహెచ్‌ఓలో గాడి తప్పిన పాలన
ప్రజారోగ్యం గాలికి వదిలేసి అక్రమాలు
చోద్యం చూస్తున్న టీడీపీ సర్కార్