చీరాల: ఇసుక దందాలకు పాల్పడుతున్న అక్రమార్కులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తే దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తూ డబ్బులు దండుకుంటున్న వారిపై కూటమి ప్రభుత్వం ఊదాసీనంగా వ్యవహరిస్తోందని చెప్పారు. చీరాల నియోజకవర్గంలో ఇసుక అక్రమార్కులపై మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసిన మాజీ విలేకరి నాయుడు నాగార్జునరెడ్డిపై ప్రత్యక్షంగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గపు చర్యగా చూడాలని అన్నారు. నాగార్జునరెడ్డిపై జరిగిన దాడి వెనుక కూటమి ఎమ్మెల్యే కుమారుడు ప్రోద్బలం ఉన్నట్లు బాధితుని భార్య మీడియా ముందు వాపోవడం చూస్తే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చనన్నారు. ఇప్పటికై నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యవహారంపై దృష్టిసారించి కూటమి పాలనలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా
అధ్యక్షుడు మేరుగ నాగార్జున


