చిన్నారిని చిదిమేసిన మినీ లారీ | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని చిదిమేసిన మినీ లారీ

Aug 20 2026 3:22 AM | Updated on Aug 20 2026 3:22 AM

చిన్నారిని చిదిమేసిన మినీ లారీ

ఎమ్మెల్యే సంస్థకు చెందిన

వాహనంగా గుర్తింపు

న్యాయం చేయాలని బాధిత కుటుంబం ఆందోళన

కర్లపాలెం(బాపట్ల): పాఠశాల నుంచి వస్తున్న ఓ విద్యార్థినిని వేగంగా వస్తున్న మినీ లారీ ఢీకొంది. దీంతో బాలిక మృతి చెందింది. ఈ విషాద ఘటన బాపట్ల జిల్లా కర్లపాలెం మండలంలోని బుద్ధాం గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. బుద్ధాం ఎస్టీ కాలనీకి చెందిన చేవూరి రాఘవయ్య, లక్ష్మీ తిరుపతమ్మ కుమార్తె చేవూరి లక్ష్మీప్రసన్న(8) స్థానిక ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లిన లక్ష్మీప్రసన్న బడి సమయం ముగియడంతో తోటి పిల్లలతో సంతోషంగా సైకిల్‌పై తమ ఇంటికి వెళుతోంది. బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజుకు చెందిన వేగేశన ఫౌండేషన్‌ వాటర్‌ సప్లై మినీ లారీ వేగంగా వచ్చి లక్ష్మీప్రసన్నను ఢీకొట్టింది. లారీ కిందపడిన బాలిక ఘటనా స్థలంలోనే మృతి చెందింది. లారీ డ్రైవర్‌ పారిపోయి కర్లపాలెం పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

బాలిక కుటుంబ సభ్యుల ఆందోళన...

తమకు న్యాయం చేయాలంటూ లక్ష్మీప్రసన్న భౌతికకాయంతో కుటుంబ సభ్యులు, బంధువులు బుద్ధాం గ్రామ సచివాలయం పక్కనే ఉన్న రహదారిపై ఆందోళన చేశారు. వేగేశన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ, జిల్లా కలెక్టర్‌ బుద్ధాం వచ్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఒకానొక సమయంలో గ్రామంలోని 216 జాతీయ రహదారిపై బైఠాయించేందుకు వారు ప్రయత్నించగా, అప్పటికే అక్కడికి చేరుకున్న కర్లపాలెం ఎస్‌ఐ రవీంద్ర తన సిబ్బందితో అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై ధర్నాలు చేయకూడదని, కేసు నమోదు చేసి నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని బాలిక కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. ఎస్‌ఐ ఇచ్చిన సమాచారం మేరకు బాపట్ల సీఐ హరికృష్ణ, కర్లపాలెం తహసీల్దార్‌ రవీంద్రకుమార్‌ ఘటనా స్థలానికి వచ్చి బాలిక కుటుంబ సభ్యులకు నచ్చజెప్పినా వారు వినకపోవడంతో ఆర్డీఓ హరికృష్ణకు ఫోన్‌ చేసి వివరాలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ రవీంద్ర, సీఐ హరికృష్ణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement