– జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్
బాపట్ల: సూర్యలంకలో జరుగుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ పేర్కొన్నారు. సూర్యలంక పర్యాటక ప్రాంతంలో స్వదేశీ దర్శన్ పథకం కింద జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పనులు నాణ్యతగా ఉండాలని సూచించారు. కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సూర్యలంకను మరింత అభివృద్ధి చేసి, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని అధికారులకు సూచించారు. సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఎ. హరికుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి బెస్టర్, తహసీల్దార్ షేక్ సలీమా, మండల సర్వేయర్ లక్ష్మీనారాయణ, టూరిజం ఏఈ శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.
శివాలయంలో
ఆభరణాలు మాయం
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శివాలయంలో భ్రమరాంబ అమ్మవారికి అలంకరించిన ఆభరణాలు మాయమైన ఘటన బుధవారం వెలుగుచూసింది. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో గత శుక్రవారం భ్రమరాంబ అమ్మవారికి శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూల అలంకరణ చేసి ఆభరణాలు అలంకరించారు. ఈ అలంకరణలో ఉన్న రెండు మంగళ సూత్రాలు, బంగారు తాడు, మంగళ సూత్రాలు అమర్చిన రూపు మాయమయ్యాయి. దీనిపై ఆలయ అధికారులను వివరణ కోరగా అమ్మవారి ఆభరణాలు మాయం అయిన మాట వాస్తవమేనన్నారు. ఈ విషయం బుధవారం అర్చకుల ద్వారా తమ దృష్టికి వచ్చిందన్నారు. అర్చకుల వివరణ కోరుతూ షోకాజ్ నోటీసులు ఇస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు.
తెనాలి: అంతర్జాతీయ గోల్ షాట్‌బాల్ చాంపియన్‌షిప్–2026కు స్థానిక సుల్తానాబాద్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్ విద్యార్థులు ఏడుగురు ఎంపికయ్యారు. అండర్–15 విభాగంలో బాలుర జట్టుకు చిల్కా రుత్విక్ కిరణ్, పెదపల్లి సుహాస్, చుండూరు హర్షద్ గౌతమ్ ఎంపికకాగా, అదే విభాగంలో బాలికల జట్టుకు దేవరకొండ అమూల్య, చుండూరు జెస్విత, దాసరి జెన్సినా జాయల్, చిలకా ప్రజ్ఞ ఎంపికయ్యారు. బాలుర జట్టుకు వివిధ రాష్ట్రాల్నుంచి 20 మందిని ఎంపికచేయగా, బాలికల జట్టుకు 14 మందిని గోల్ షాట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎన్.రాజేంద్రప్రసాద్ ఈ ప్రకారం ఇటీవల ప్రకటించారు. భూటాన్‌లో పోటీలు ఈనెల 24 నుంచి 27వ తేదీవరకు జరగనున్నాయని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి, సెయింట్ ఆన్స్ స్కూలు పీఈటీ విమోద్‌కుమార్ తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సౌమ్య, కరస్పాండెంట్ సిస్టర్ లీసా జార్జ్, మరో పీఈటీ శ్రీనివాసరావులు జాతీయ జట్టుకు ఎంపికై న క్రీడాకారులను అభినందించారు.
చిలకలూరిపేట: కోర్టు భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించి పంపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ తెలిపారు. పట్టణంలోని గంగమ్మగుడి సమీపంలో న్యాయస్థానాల నిర్మాణం కోసం ప్రతిపాదించిన స్థలాన్ని బుధవారం జిల్లా జడ్జి బి.సాయికళ్యాణ చక్రవర్తితో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంబంధిత అధికారులు వెంటనే ప్రతిపాదనలు రూపొందిస్తే పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.నరేంద్రరెడ్డి, ఆర్డీఓ కె.బాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ పి.శ్రీహరిబాబు, తహసీల్దార్ కె.వేణుగోపాల్ పాల్గొన్నారు.


