పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు మేరకు పరిశీలించిన రేపల్లె ఆర్డీఓ
చెరుకుపల్లి: దళితుల స్మశానవాటికలో ఎటువంటి అనుమతులు లేకుండా సమాధుల మీదుగా రోడ్డు వేశారంటూ గతంలో గ్రామస్తులు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసిన నేపధ్యంలో దీనిపై రేపల్లె ఆర్డీఓ శ్రీదేవి మండలంలోని గాంధీనగరం గ్రామంలో బుధవారం పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆర్డీఓ స్థానికులను అడిగి వివరాలు నమోదు చేసుకున్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తోట సురేష్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
వినతిపత్రాలు అందజేసి వైద్యుల నిరసన
గుంటూరు మెడికల్: ప్రభుత్వం నుంచి తమకు న్యాయబద్ధంగా రావాల్సిన యూజీసీ–2016 జీతం బకాయిలు ఇవ్వడం కుదరదని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి తాఖీదు ఇచ్చినందుకు నిరసనగా బుధవారం గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ నేతలు (జీడీఏ ఏపీ) గుంటూరు వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేసి నిరసన తెలియజేశారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ఇచ్చిన తాఖీదుకు నిరసనగా మూకుమ్మడిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు యూనియన్ నేతలు తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ నినాదాలు చేశారు. వైస్ ప్రిన్సిపాల్‌కు వినతిపత్రం అందజేసిన వారిలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ స్వరూప్‌కాంత్, నేతలు డాక్టర్ మారుతీ దేవి, డాక్టర్ అజయ్, డాక్టర్ రాజా, డాక్టర్ సుధా రాణి తదితరులు పాల్గొన్నారు.
పాలువాయిగేటులో మహిళ ఆత్మహత్య
రెంటచింతల: మండలంలోని పాలువాయి గేటు గ్రామంలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గ్రామంలోని సచివాయం వీధిలో నివసిస్తున్న నూతి ఆదిలక్ష్మి(41) ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన గాలి సత్యనారాయణతో 8 సంవత్సరాలుగా సహజీవనం చేస్తుంది. సత్యనారాయణ తల్లి అనారోగ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా అతడితో వచ్చిన ఆదిలక్ష్మి గ్రామంలో ఉన్న అరెకరం పొలంతో పాటు ఇల్లు కూడా తనపేరుపై రాస్తేనే మీ అమ్మను నేను చూస్తానని అతడితో గొడవపడింది. సత్యనారాయణ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సీహెచ్ నాగార్జున ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


