వక్ఫ్‌ బోర్డు స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బోర్డు స్థలంలో నిర్మాణాలను నిలిపివేయాలి

Aug 20 2026 3:52 AM | Updated on Aug 20 2026 3:52 AM

హైకోర్టు ఉత్తర్వుల మేరకు నోటీసు జారీ చేసిన మున్సిపల్‌ కమిషనర్‌

నరసరావుపేట: మున్సిపల్‌ కార్యాలయానికి ఎదురుగా రోడ్డు స్థలం, వక్ఫ్‌బోర్డు స్థలంలోని మసీదు పార్కింగ్‌ స్థలాలను ఆక్రమించి అనుమతులకు విరుద్ధంగా నిర్మిస్తున్న షాపుల నిర్మాణాలను వెంటనే నిలిపివేసి వాటిని ఖాళీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ బి.రమ్యకీర్తన ఉత్తర్వులు జారీ చేశారు. వక్ఫ్‌బోర్డుకు చెందిన 32,304 చదరపు అడుగుల స్థలంలో అంజుమన్‌ ఇ ఇస్లామియా పేరుతో కొందరు వ్యక్తులు పల్నాడు అర్బన్‌ డెవలప్మెంట్‌ అథారిటీ వద్ద జీ ప్లస్‌ ఒన్‌ భవన నిర్మాణానికి అనుమతి పొంది ప్లానుకు విరుద్ధంగా నిర్మాణం చేస్తున్నారని నోటీసులు జారీ చేశామన్నారు. స్థలంలో అనధికారికంగా 72 షాపులు నిర్మిస్తున్నట్లు షేక్‌ అబ్దుల్‌రజా, షేక్‌ జానిమౌలాలీ హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారని చెప్పారు. దీనికి కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల మేరకు నిర్మాణ పనులను ఆపేయాలంటూ నోటీసు జారీ చేయటం జరిగిందన్నారు. నిర్మాణ నిలుపుదల చేయలేదన్నారు. దీనిపై మాజీ కౌన్సిలర్‌ షేక్‌ జానీమౌలాలీ పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు అందజేసిన ఫిర్యాదు మేరకు సదరు స్థలాన్ని పరిశీలించగా ప్లానుకు విరుద్ధంగా దుకాణాలు నిర్మిస్తున్నట్లుగా తెలియవచ్చిందన్నారు. వెంటనే నిర్మాణాలు ఆపి ఆక్రమించిన మసీదు పార్కింగ్‌ స్థలాన్ని, రోడ్డు ఆక్రమణ స్థలాలను ఖాళీ చేయకపోతే మున్సిపాల్టీ చట్టం మేరకు పురపాలక సంఘమే తొలగించి అందుకు అయ్యే ఖర్చులను బాధ్యుల నుంచి వసూలు చేస్తామని హెచ్చరించారు.

ఆకట్టుకున్న గరికపాటి ప్రవచనాలు

రాజుపాలెం: స్థానిక పద్మావతీ గోదా సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఐదవ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. బుధవారంతో వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా ముఖ్యఅతిథిగా మహా సహస్రావధాని పురష్కార గ్రహీత డాక్టర్‌ గరికపాటి నరసింహారావు పాల్గొని శ్రీవెంకటేశ్వరస్వామి మహాత్య ప్రవచనాలను వివరించారు. చుట్టు పక్కల గ్రామాలవారు వారి ప్రవచనాలను వినడానికి అధిక సంఖ్యలో వచ్చారు. అనంతరం బాలాజీ ట్రస్ట్‌ చైర్మన్‌ పొత్తూరి వెంకటరామసుబ్బారావు ప్రవచనాలను బోధించిన గరికపాటి నరసింహారావును దుశ్యాలువాతో సత్కరించి, దేవతావస్త్రాలను అందజేశారు. బ్రహ్మోత్సవాలకు ముగింపు సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు భక్తులకు తీర్థప్రసాదాలను అందించారు.

అసెంబ్లీ భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఐజీ

తాడికొండ: ఏపీ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు, వీఐపీల భద్రతతో పాటు శాసనసభ పరిసర ప్రాంతాల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గుంటూరు జిల్లా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని శాసనసభ పరిసర ప్రాంతాలను 3వ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలించి, బందోబస్తు విధుల్లో ఉన్న పోలీస్‌ అధికారులు, సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. అసెంబ్లీకి వచ్చే ప్రధాన మార్గాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు, వాహన తనిఖీ కేంద్రాలు, ప్రవేశ ద్వారాలు, వీవీఐపీ/వీఐపీ మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాలను పరిశీలించారు. ప్రతి వ్యక్తి, వాహనాన్ని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు లేదా వాహనాల కదలికలను గుర్తించిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. ఐజీ వెంట తుళ్లూరు సీఐ కె.శ్రీనివాసరావు, పలువురు సిబ్బంది ఉన్నారు.

ప్రకృతి వ్యవసాయం ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించవచ్చు

అచ్చంపేట: ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించడం ద్వారా రైతులు పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, అధిక దిగుబడులు సాధించవచ్చని, అదనపు ఆదాయాన్ని పొందవచ్చని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్‌ కె.అమల కుమారి సూచించారు. మండల కేంద్రంలోని అచ్చంపేటలో బుధవారం పత్తి పంట పరిశీలించారు. పంట ఎదుగుదల, అంతర పంటల సాగు, చీడపీడల నివారణకు చేపడుతున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించి రైతులతో చర్చించారు. పత్తి పంటలో జగురు పూసిన పసుపు రంగు అట్టలను అక్కడక్కడ ఏర్పాటు చేసినట్లయితే రసం పీచ్చే పురుగుల ఉనికిని గుర్తించవచ్చన్నారు. అలాగే గులాబి రంగు పురుగుల ఉధృతిని గమనించేందుకు ఎకరాకు 8 చొప్పున లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. పత్తి పంటలో అంతర పంటల సాగు చేయడం వలన నేల సారం మెరుగుపడటంతో పాటు అదనపు ఆదాయం లభిస్తుందని, చీడ పీడల ఉధృతిని కూడా తగ్గించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement