భారీగా పతనం
పతనమైన ఆక్వా ధరలు ధరలకు సిండికేట్ దెబ్బ తీవ్రంగా నష్టపోతున్న రైతులు చోద్యం చూస్తున్న కూటమి ప్రభుత్వం
వేటపాలెం: రొయ్యల సాగు ఈ ఏడాది కూడా రైతులకు కలిసి రాలేదు. మార్కెట్లో వెనామీ రొయ్యలకు ధర పడిపోయింది. ధర బాగున్న టైగర్ రొయ్యలు పంట చేతికి అందే సమయంలో వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలు తగ్గించారు. దీనికి తోడు టైగర్ రకానికి వైట్‌స్పాట్ రావడంతో చెరువుల్లో రొయ్యల పెరుగుదల నిలిచిపోయింది. దీంతో కేవలం 25 నుంచి 30 కౌంట్‌కే పంట తీసి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
జిల్లాలో పరిస్థితి ఇదీ..
జిల్లాలో నిజాంపట్నం, కర్లపాలెం, బాపట్ల, వేటపాలెం, చిన్నగంజాం, రేపల్లె మండలాల పరిధిలో 23,868 ఎకరాల్లో ఆక్వా పంట సాగు చేసుకున్నారు. ఇందులో 70 శాతం టైగర్ రొయ్యలున్నాయి. 30 శాతం వనామీ రకం ఉంది. టైగర్ రొయ్యల సాగు పంట చేతికి అందే సమయం వచ్చింది. రొయ్యల మేత, రసాయనాల ధరలు పెరగడం, వైరస్‌లు, వైట్‌గట్ సమస్యల కారణంగా వనామీ రొయ్యలు నష్టాల బారిన పడ్డాయి. ఇటీవల వరకు మార్కెట్‌లో ధర బాగుండటంతో టైగర్ రొయ్యల సాగు కొంత ఆశాజనకంగా ఉంది. వీటిపైనే సాగుదారులు ఆశలు పెట్టుకున్నారు. గత ఫిబ్రవరి, మార్చిలో జిల్లా రైతులు చెరువుల్లో పిల్లలు వదిలి సాగు ప్రారంభించారు. అయితే అప్పట్లోనే నాణ్యమైన సీడ్ లభించక కొంత శాతం పిల్లలు చనిపోయాయి.
జూన్ నెలలో 20 కౌంట్ టైగర్ రొయ్యల ధర రూ.730 వరకు పలికింది. అదే జూలై నెలకు రూ.670కి పడిపోయింది. ప్రస్తుతం సిండికేట్ మాయతో అదే రకం రూ.610కి తగ్గించారు. 30 కౌంట్ ధర రూ.570 నుంచి రూ.450కి పడిపోయింది. 20 కౌంట్‌కు పెంచితే ధర లభించి లాభాలు వస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణం రొయ్యల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుందని రైతులు తెలిపారు. కొంతకాలంగా టైగర్ రొయ్యలు వైట్‌స్పాట్ వ్యాధి బారిన పడుతున్నాయి. నీటి ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పులు, లవణీయత తగ్గడం లేదా పెరగడం వల్ల నీటిలో ఆక్సిజన్ స్థాయులు పడిపోయి రొయ్యలను ఒత్తిడికి గురిచేస్తాయని రైతులు తెలిపారు. వ్యాధి సోకిన రొయ్యలు మేత తినడం ఆపేస్తాయి. వ్యాధి బారినపడ్డ మూడు నుంచి పది రోజుల్లోనే చనిపోయే అవకాశం ఉంది. రైతులు 20 కౌంట్ రాకముందే 25, 30 కౌంట్ల వద్ద రొయ్యలను చెరువుల్లో నుంచి పట్టి విక్రయిస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని వ్యాపారులు కేజీకి రూ.450 నుంచి రూ.470 వరకు ధర చెల్లిస్తున్నారు. దీంతో టన్నుకు రూ.2 లక్షల చొప్పున నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు.


