పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తా పోలేరమ్మకు ఘటాభిషేకం మెడికల్‌ కాలేజీని సందర్శించిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సోమరాజు స్వాతంత్య్ర దినోత్సవ రిహార్సల్స్‌

గుంటూరు రూరల్‌: హైవేపై పెట్రోల్‌ ట్యాంకర్‌ బోల్తాపడిన ఘటన గురువారం నల్లపాడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురానికి చెందిన నూర్‌అహ్మద్‌, రామ్మూర్తిలు లారీ డ్రైవర్‌లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం విజయవాడ నుంచి పెట్రోల్‌ ట్యాంకర్‌ను అనంతపురం తీసుకు వెళుతుండగా అంకిరెడ్డిపాలెం సమీపంలో ప్రమాదవశాత్తూ లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇరువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు చికిత్స నిమత్తం ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై పెట్రోల్‌ పడిపోవటంతో ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని ప్రయాణికులను దారి మళ్లించారు. ట్యాంకర్‌ను లేపి ప్రమాదం జరగకుండా కాపాడారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నల్లపాడు పోలీసులు పేర్కొన్నారు.

కాకుమాను: కొండపాటూరు గ్రామంలోని పోలేరమ్మ వారి దేవస్థానంలో గురువారం ఉదయం ఘటాభిషేకం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మకర్తల మండలి చైర్మన్‌ పొన్నం వీరయ్యచౌదరి, ధర్మకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అమ్మవారి ఆశీస్సులతో గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

గుంటూరుమెడికల్‌: ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ సోమరాజు గురువారం గుంటూరు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీని సందర్శించారు. వైద్య విద్యలో ఉత్తమ బోధన అందిస్తున్న అధ్యాపకులను ప్రోత్సహించే ఉద్దేశంతో, కళాశాలలో ప్రతిభ కనబరుస్తున్న అధ్యాపకులకు తన సొంత ఖర్చులతో ‘ఉత్తమ అధ్యాపక పురస్కారం’ అందించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయమై గుంటూరు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎన్‌వీ సుందరాచారి, గుంటూరు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరిజవోలు దుర్గాప్రసాద్‌లతో ఆయన సమావేశమయ్యారు. గుంటూరు మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌ ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణాన్ని, విద్యార్థులకు అందిస్తున్న వైద్య విద్యా బోధన, వివిధ విభాగాలు, ప్రయోగశాలలు, విద్యా సదుపాయాల గురించి వివరించారు. డాక్టర్‌ సోమరాజు మాట్లాడుతూ కళాశాల గణనీయమైన అభివృద్ధి సాధించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్‌తోపాటు సహకరించిన దాతలను కూడా ఆయన అభినందించారు. వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శ్రీధర్‌, డాక్టర్‌ సోమరాజు బ్యాచ్‌మేట్స్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి, డాక్టర్‌ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

తాడికొండ: రాజధానిలో శనివారం జరిగే స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా గురువారం రిహార్సల్స్‌ నిర్వహించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ, ఎస్పీ వకుల్‌ జిందాల్‌ హాజరై ఏర్పాట్లను పరిశీలించారు. పెరేడ్‌ గ్రౌండ్‌లో భద్రతా ప్రమాణాలు, వీఐపీ, వీవీఐపీ మార్గాలు, పార్కింగ్‌ ప్రదేశాలు, ప్రభుత్వ శాఖల శకటాల ఏర్పాటు ప్రాంతాలను ఎస్పీ, కలెక్టర్‌ పరిశీలించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌ డైవర్షన్‌, వాహనాల రాకపోకల నియంత్రణపై సంబంధిత పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ కె మయూర్‌ అశోక్‌, సమాచార పౌర సంబంధాల శాఖ ఇన్‌చార్జి డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement