అర్హత ఉన్నా నగదు జమ కాకపోవడంపై నేతన్నల ఆగ్రహం చేనేత, జౌళి శాఖ కార్యాలయం ముందు నిరసన లబ్ధిదారుల ఎంపికలో కూటమి నాయకుల చేతివాటం? అర్హులందరికీ న్యాయం కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వినతి
డబ్బులు జమ కాలేదు
ఐదేళ్లూ ‘నేతన్న నేస్తం’ వర్తింపు
చీరాల: రెండేళ్లుగా నేతన్నలకు పైసా కూడా విదల్చని కూటమి ప్రభుత్వం మూడో ఏట మమ అనిపిస్తోంది. పథకం కింద నగదు జమ కాగా... చాలా మంది అర్హులకు అందలేదు. దీంతో తమకు అర్హత ఉన్నా డబ్బులు పడకపోవడంతో చేనేత, జౌళి శాఖ జిల్లా కార్యాలయం వద్ద గురువారం పలువురు బాధితులు నిరసన చేపట్టారు. నేతన్నలకు అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ తరఫున ఇన్‌చార్జి కరణం వెంకటేష్ బాబు ఆదేశాల మేరకు గురువారం ఏడీకి వినతిపత్రం అందించారు.
అర్హులకు మొండి చేయి
మగ్గం నేసే ప్రతి చేనేత కార్మికుడికి మగ్గం, చేనేత కార్మికుడి గుర్తింపు కార్డు ప్రామాణికంగా పథకాన్ని అమలు చేస్తామని టీడీపీ ప్రభుత్వం చెప్పింది. జిల్లాలో 7,620 మందికి గాను 5,200 మంది బ్యాంకు ఖాతాలలో సాయం జమ చేశారు. 1,815 మందికి అర్హత ఉన్నా నగదు జమ కాలేదు. అలానే 1,545 మందికి సాఫ్ట్‌వేర్ సమస్య వలన జమ కాలేదని అధికారులు తెలిపారు. గత ఐదేళ్లుగా తమకు నేతన్న నేస్తం డబ్బులు జమ అయ్యాయని, ప్రస్తుతం రాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మగ్గం ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం వర్తిస్తుందని అధికారులు చెప్పడంతో కూటమి మండల, గ్రామ స్థాయి నాయకులకు వరంగా మారింది. అధికారులు కాకుండా కూటమికి చెందిన నాయకులే దరఖాస్తులు తీసుకుని అనర్హులను జాబితాలో చేర్చారు. భారీగా వసూళ్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాంగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీరక సురేంద్ర , వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, చేనేత జన సమాఖ్య అధ్యక్షుడు దేవన వీరనాగేశ్వరరావు తదితరులు ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఏడీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డబ్బులు జమ కాని వారి దరఖాస్తులను సచివాలయాల్లో ఇవ్వాలన్నారు. చేనేత నాయకులు కర్ణ లక్ష్మారావు, దేవన హేమ, దాశరధి, దంతం వెంకటసుబ్బారావు, వేటపాలెం మండలం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సాధు రాఘవ, మాజీ అధ్యక్షుడు బొడ్డు సుబ్బారావు, బీరక సురేష్, సజ్జా శ్రీనివాసరావు, బాలాజీ, మచ్చా శేఖర్, నున్న నాగరాజు, గుత్తి మల్లేశ్వరరావు, బీరక కేదారేశ్వరరావు, కోటిలింగం, వైఎస్సార్‌సీపీ నాయకులు బత్తుల అనిల్, కంపా అరుణ్, గుంటూరు ప్రభాకరరావు, చేనేత కార్మికులు పాల్గొన్నారు.
చేనేత కార్మికుడిగా గుర్తింపు కార్డు, మగ్గం ఉంది. గత ప్రభుత్వ హయాంలో నాకు ఐదేళ్లు రూ.24 వేలు చొప్పున డబ్బులు జమ చేశారు. కూటమి ప్రభుత్వంలో పథకం లబ్ధి కోసం దరఖాస్తులు అందించా. అర్హత ఉన్నా డబ్బులు జమ కాలేదు.
– మచ్చా శేఖర్, చేనేతపురి
అర్హత ఉన్న చేనేత కార్మికులకు అన్యాయం జరుగుతోంది. ఐదేళ్ల పాటు నేతన్న నేస్తం పథకం వర్తించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో పథకం కోసం దరఖాస్తు అందించా. మగ్గం ఫొటో, నేత కార్మికుడిగా గుర్తింపు కార్డు ఉంది. అయితే నా పేరు అర్హుల జాబితాలో లేదు.
– జి.హరికృష్ణ, రామానగర్, వేటపాలెం


