దేశాభివృద్ధిలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి జిల్లా కలెక్టర్ వినోద్‌కుమార్
రేపల్లె: దేశ స్వాతంత్య్ర సముపార్జనలో అనేక పోరాటాలు చేసి ప్రాణాలు త్యాగం చేసిన మహనీయుల చిరస్మరణీయులని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి పౌరుడు దేశ అభివృద్ధిలో భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 80వ స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘..అనే నేను’’ కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గురువారం నిర్వహించిన సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బ్రిటిష్ పాలకుల కబంధ హస్తాల నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చి, దేశ ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చిన స్వాతంత్య్ర సమరయోధుల సేవలు ఎనలేనివన్నారు. దేశభక్తిని పెంపొందించుకోవటంతోపాటు దేశ అభివృద్ధి, దేశాన్ని అన్ని రంగాలలో ముందుంచటమే వారికి మనం అందించే ఘన నివాళి అని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుతూ పురప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. పెనుమూడి హైవేలోని ‘వై’ జంక్షన్ నుంచి రాజ్యలక్ష్మి థియేటర్ సర్కిల్ వరకు వివిధ పాఠశాలల విద్యార్థులతో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పేటేరు గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ బూసి శ్రీదేవి, జిల్లా బీసీ సంక్షేమ సాధికార అధికారి శివలీల, మున్సిపల్ కమిషనర్ కాకర్ల సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి సత్యనారాయణ, టీడీపీ నాయకులు అనగాని శివప్రసాద్, పంతాని సాయికుమార్, దేవగిరి రవిశంకర్, పి.సాంబశివరావు, పలువురు అధికారులు, వివధ పాఠశాలల విద్యార్థులు, బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.


