లక్ష్మీపురం: అరండల్‌పేటలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఇద్దరు మేనేజర్లు సైబర్ నేరానికి పాల్పడటంతో అరెస్టు చేశారు. అరండల్‌పేట, సైబర్ క్రైమ్ పోలీసులు వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో సీఐ ఆరోగ్య రాజు విలేకరులతో తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు అరండల్‌పేట 4వ లైన్‌లోని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో బ్రాంచ్ మేనేజర్లుగా సయ్యద్ నౌషాద్, ఆపరేషనల్ మేనేజర్‌గా షేక్ బాజీ విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది మనీ మ్యూల్ అకౌంట్స్ ద్వారా సుమారుగా 11 ఖాతాల నుంచి రూ.25 లక్షలు విత్‌డ్రా చేసినట్లు సీఐడీ నుంచి ఫిర్యాదు వచ్చింది. సైబర్ క్రైమ్ సోషల్ మీడియా వింగ్‌కు చెందిన ఎస్‌ఐ లక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మొత్తం రూ.25 లక్షలు సైబర్ మోసం చేసినట్లు తెలిసింది. సయ్యద్ నౌషాద్ ఇదంతా చేసి మేనేజర్ కొడవటిగంటి రామకృష్ణ ద్వారా యూకేలో ఉండే దగ్గుపాటి సాయి కిరణ్‌కు చేర్చి కమీషన్ తీసుకున్నట్లు గుర్తించారు. నేపాల్‌లో సైబర్ నేరం చేసి రూ.4.87 లక్షల నగదు కాజేసిన మోసంలో కూడా వీరు పాల్గొన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. శనివారం బ్రాడిపేట 4వ లైను వద్ద సయ్యద్ నౌషాద్, రామకృష్ణలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 సెల్‌ఫోన్‌లు స్వాధీన పరుచుకున్నారు. కేసు ఛేదనలో ప్రతిభ చాటిన అరండల్‌పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్‌ఐ ఈశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ ఒ. చిరంజీవులు, కానిస్టేబుల్ అప్పలనాయుడు, సైబర్ క్రైమ్ సెల్ సీఐ మొహమ్మద్ నిసార్ బాషా, ఎస్‌ఐ లక్ష్మి , హెడ్ కానిస్టేబుల్ రాజ కిశోర్, కానిస్టేబుల్‌లు యాసిన్, సాయి, ఇమాం, మానస, అరుణలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.
సైబర్ క్రైమ్‌కు సహకరించిన నిందితులు


