చీరాల రూరల్: తోటి ప్రయాణికురాలు బస్సులో పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగును పోలీసుల సమక్షంలో బాధితురాలికి అప్పగించి తన నిజాయతీని చాటుకున్నాడు వ్యాపారి గౌస్‌బేగ్. వన్‌టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపిన వివరాల మేరకు.. చీరాల మసీదు సెంటర్లో బ్యాటరీల షాపు నిర్వహిస్తున్న గౌస్‌బేగ్ చందోలు నుంచి చీరాలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాడు. అదే బస్సులో చెరుకుపల్లి నుంచి ప్రయాణిస్తున్న దేవరకొండ రాధిక తన హ్యాండ్‌బ్యాగును పొరపాటున బస్సులో మరిచిపోయి బస్సు దిగింది. అదే సమయంలో బస్సులో నుంచి దిగుతున్న గౌస్‌బేగ్‌కు బ్యాగు కనపడింది. బ్యాగులో రూ. 15,500 ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే గౌస్‌బేగ్ తన కుమారుడు మీర్జా సహాయంతో హ్యాండ్ బ్యాగును చీరాల వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి సీఐ సోమశేఖర్, ఎస్సై రాజ్యలక్ష్మికి అప్పగించారు. కాగా సీఐ బ్యాగులో ఉన్న స్కూలు రిసిప్ట్ ఆధారంగా స్కూలు యాజమాన్యానికి ఫోన్‌చేసి సెల్‌ఫోన్ నంబర్ సేకరించారు. బాధితురాలు దేవరకొండ రాధికగా గుర్తించి ఆమెను పోలీసు స్టేషన్‌కు పిలిపించి నగదుతో పాటు ఇతర వస్తువులు ఉన్న హ్యాండ్‌బ్యాగును ఆమెకు అప్పగించారు. దీంతో రాధికతో పాటు పోలీసులు గౌస్‌బేగ్ నిజాయతీని అభినందించారు.


