కొరిటెపాడు(గుంటూరు): వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్(ఎంపీఈఓ)లను పర్మినెంట్ చేయాలని ఏపీ మల్టీ పర్పస్ ఎక్స్‌టెన్సన్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పుల్లగూర అనిల్‌కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సమాన పనికి సమాన వేతనం కింద రూ.35 వేల వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఎంపీఈఓలు బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్లకార్డులు చేతపట్టి సహాయ నిరాకరణ, ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఎంపీఈఓలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. 12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కేవలం రూ.12 వేలు మాత్రమే జీతం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న నాలుగు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాన్ శాంక్షన్ పోస్టులను శాంక్షన్ కింద నమోదు చేయాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రమాద బీమా వర్తింపజేయాలని, విధి నిర్వహణలో మరణిస్తే ఎక్స్‌గ్రేషియాతో పాటు కుటుంబంలో ఒక్కరికీ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీఈఓలకు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజుల పాటు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సహాయ నిరాకరణ, ధర్నా, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకుంటే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డేవిడ్, నాయకులు అనిల్, అఖిల్, వర్ధన్, సురేష్, రాఘవ, అంజిబాబు, సుభానీ, వెంకటేష్, కోటి, శాంతి, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీఈఓల అసోసియేషన్
రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్


