మెప్మా పీడీ కార్యాలయానికి పిలిపించి పంచాయితీ చేస్తున్న సీఓలు?
ఎమ్మెల్యే పక్కన ఉండే వ్యక్తి, డివిజన్‌లోని క్లస్టర్ ఇన్‌చార్జ్ అండతో ఇష్టారాజ్యం
ఆర్పీల వేతనాల విడుదలకు మార్గం సుగమం అయ్యేనా?
నెహ్రూనగర్(గుంటూరు ఈస్ట్): తీవ్ర ఒత్తిడి మధ్య ఆర్పీలు అల్లాడిపోతున్నారు. తమకు గత నాలుగు నెలలుగా సీఓ ఇందిరా సుశీల జీతాల అప్రూవల్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్న విషయంపై 12వ డివిజన్‌కు చెందిన ఆర్పీలు కొద్ది రోజుల క్రితం తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్‌కు వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ‘జీవితాలను ‘ఆర్పీ’వేస్తున్నారు’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల 20వ తేదీన కథనం ప్రచురితమైంది. ఈ కథనంతో ఉలిక్కి పడిన మెప్మా సిబ్బంది దీన్ని సరిదిద్దుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు.
పీడీ స్థాయిలో విచారణ చేయరా?
ఆర్పీల జీతాల విషయంపై రచ్చ జరుగుతుండటంతో మెప్మా కార్యాలయంలో ఓ సీఓ.. ఈ వివాదాన్ని పలుచన చేసేందుకు యత్నిస్తున్నట్లు తెలిసింది. ఆ సమస్యను పీడీ స్థాయి అధికారి విచారణ చేపట్టాల్సి ఉండగా..సీఓ స్థాయి వ్యక్తి విచారణ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ఆర్పీలను కలెక్టరేట్ వద్ద ఉన్న మెప్మా కార్యాలయానికి ఓ సీఓ పిలిపించి బుజ్జగించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో సదరు ఆర్పీలు కూడా సీఓ కాదు.. జీతాలు ఆప్రూవల్ పీడీ లాగిన్‌లో పెండింగ్‌లో ఉన్నాయంటూ.. కాదు మరో అధికారి లాగిన్‌లో ఉన్నాయంటూ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. దీంతో వివాదం ముదరకుండా ఆర్పీలకు జీతాలు వేసే ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
గతంలో ట్యాబ్‌ల కుంభకోణం
ఎమ్మెల్యే వెంట తిరిగే ఓ వ్యక్తి, డివిజన్‌లో ఉండే క్లస్టర్ ఇన్‌చార్జ్ అండ చూసుకునే సీఓ రెచ్చిపోతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్లస్టర్ ఇన్‌చార్జ్ కనుసన్నల్లోనే సదరు సీఓ అన్ని పంచాయితీలు చేస్తున్నట్లు విమర్శలున్నాయి. గతంలో ఆర్పీలకు ట్యాబ్‌లు ఇచ్చే సమయంలో కూడా ట్యాబ్‌కు రూ.5వేలకు పైగా వసూలు చేసిన విషయం తెలిసిందే. ఇది కూడా క్లస్టర్ ఇన్‌చార్జ్ పర్యవేక్షణలో జరిగినట్లు తెలిసింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఆర్పీలపై టీడీపీ నాయకుల పెత్తనం లేకుండా చూడాలని పలువురు ఆర్పీ సంఘాల నాయకులు కోరుతున్నారు.


