గుంటూరు వెస్ట్: సీనియర్ సిటిజన్లను గౌరవించడం మన కనీస బాధ్యతని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాలులో నిర్వహిస్తున్న పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ రెండో రోజు కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తితోపాటు జిల్లా కలెక్టర్ సీఎం సాయి కాంత్ వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ పెద్దలను గౌరవించే సమాజం గొప్ప సమాజంగా నిలుస్తుందన్నారు. ఉద్యోగ విరమణ చేసిన సిబ్బంది తమ సేవా కాలంలో ప్రభుత్వానికి అందించిన సేవలు అమూల్యమైనవని, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం ప్రతి శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో ఉద్యోగులు పెన్షన్ మంజూరు కోసం ఏజీ కార్యాలయం చుట్టూ తిరిగేవారని, అలాంటి పరిస్థితుల్లో వారిని గుర్తించి గౌరవించడం గొప్ప విషయమన్నారు. ఇందుకు అకౌంటెంట్ జనరల్ కార్యాలయ అధికారులకు అభినందనీయులన్నారు. జిల్లా కలెక్టర్ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ ఉద్యోగ విరమణ చేసాక వారు పడే ఇబ్బందులను సత్వరంగా పరిష్కరించేందుకు జిల్లాలకు తరలివచ్చి ప్రత్యక్షంగా అదాలత్ నిర్వహిస్తుండటం శుభసూచికమన్నారు. ఇటువంటి కార్యక్రమాలు పెన్షనర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు. సర్వీస్‌లో ఉన్నప్పుడు సీనియర్ అధికారుల నుంచి నేర్చుకుని, వారి ఉద్యోగ విరమణ సమయంలో వారికి సేవలు అందించడం మంచి విషయమన్నారు. ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ శాంతిప్రియ మాట్లాడుతూ సుదీర్ఘ సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులు పెన్షన్ పొందటం వారి హక్కు అని, దానిని సక్రమంగా అందించడం తమ బాధ్యతన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్‌లు విరమణ చేసిన ఉద్యోగులు కొందరికి పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు. జీపీఎఫ్ చందాదారులు, డీడీఓల అవసరార్ధం సమగ్ర సమాచారంతో కూడిన తెలుగులో ముద్రించిన కరదీపికను జిల్లా జడ్జి, జిల్లా కలెక్టర్ సంయుక్తంగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యుటీ అకౌంటెంట్ జనరల్ ఆషితా పట్నాయక్ , కుషాల్ కార్తీక్, జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, అకౌంటెంట్ జనరల్ కాార్యాలయ సీనియర్ అధికారులు టి.విజయ్ కుమార్, డి.చంద్రశేఖర్, వి.సురేష్, పి.రమేష్ తదితరులు, జిల్లా ట్రెజరీ డీడీ చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖల ప్రతినిధులు, ఉద్యోగులు, పెన్షనర్లు పాల్గొన్నారు.
ప్రిన్సిపల్ జిల్లా జడ్జి సాయి కళ్యాణ్ చక్రవర్తి


