పార్టీని వీడిన కీలక నేత గూడపాటి
రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలో టీడీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయన పార్టీని వీడటం గమనార్హం. మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు ప్రధాన అనుచరుడిగా ఉన్న రేపల్లె పట్టణానికి చెందిన శ్రీనివాసరావు గురువారం తన రాజీనామాను ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ లేఖలో పేర్కొన్నారు. సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించిన ఆయనకు ప్రాధాన్యం లేకపోవడం, కేడర్‌ను అధిష్ఠానం పట్టించుకోకపోవడం, స్థానిక నాయకత్వం వైఫల్యం వంటి కారణాల వల్లే రాజీనామా చేసినట్లు అనుచరులు చెబుతున్నారు. ప్రజల సమస్యలపై పోరాడే నాయకులను పక్కన పెట్టి, కేవలం కొందరికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్న టీడీపీ ధోరణిపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. మంత్రి సత్యప్రసాద్, ఆయన సోదరుడు శివప్రసాద్‌లు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలతో పార్టీ ప్రథమ శ్రేణి నాయకులు సైతం ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. రాజీనామాకు అసలు కారణాలపై అధికారికంగా స్పందన రాకపోయినా పార్టీలో అంతర్గత విభేదాలు, నాయకత్వంపై అసంతృప్తి కారణమని స్పష్టమవుతోంది. గూడపాటి శ్రీనివాసరావు మామ తాడివాక శ్రీనివాసరావు 2014 – 19 వరకు రేపల్లె మున్సిపల్ చైర్మన్‌గా సేవలు అందించారు.


