భట్టిప్రోలు: స్థానిక బౌద్ధ స్తూపం అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో గురువారం ఆయన భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక ప్రాంతమైన భట్టిప్రోలు స్తూపం సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఎంపీ మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైన బౌద్ధ క్షేత్రాలలో భట్టిప్రోలు స్తూపం ఒకటని గుర్తుచేశారు. ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బౌద్ధ పర్యాటక సర్క్యూట్‌లో అభివృద్ధి చేయడం, బౌద్ధ వారసత్వ ప్రదేశాల మధ్య అనుసంధానం కల్పించాలన్నారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.


