తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా సీతానగరం వద్ద కృష్ణా పశ్చిమ డెల్టాకు బుధవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రకాష్‌లు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ కృష్ణానదిపై ఎగువన ఉన్న రిజర్వాయర్లలో నీటి నిల్వలు లేనందున కృష్ణా డెల్టాకు రాలేదన్నారు. కృష్ణా డెల్టా 13 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి అయోమయంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిచింతలలో 30 టీఎంసీలు నిల్వ చేసుకునేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా 16 టీఎంసీలు తరలించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతంలో వర్షాలు పడితే మరో 30 టీఎంసీలు, వెరసి ఈ సీజన్లో 75 టీఎంసీలు అందించే వీలు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. కృష్ణా డెల్టాలోని మొత్తం 13 లక్షల ఎకరాల సాగుకు 150 టీఎంసీలు అవసరమని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేడీఎస్ సీఈ రాంబాబు, రాష్ట్ర సాగునీటి సంఘాల ప్రతినిధులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు, తదితరులు పాల్గొన్నారు.
బగళాముఖి ఆలయంలో ప్రత్యేక పూజలు
చందోలు(కర్లపాలెం): బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ప్రసిద్ధిగాంచిన బగళాముఖి అమ్మవారి దేవస్ధానంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి లఘు వారాహిదేవి అలంకరణ చేశారు. మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ప్రాంగణం శుద్ధి చేయటంతోపాటు సుందరంగా అలంకరించారు. ఆలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేశారు. అనంతరం ట్రస్టు బోర్డు చైర్మన్ కలకోట చక్రధర్‌రెడ్డి జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. అర్చకులు అష్టోత్తర శతనామార్చన, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
టీటీడీకి రూ.30 లక్షల విరాళం
గుంటూరు మెడికల్: టీటీడీ శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు నగరానికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్, బ్రిందా న్యూరో సెంటర్ అధినేత డాక్టర్ హనుమ శ్రీనివాసరెడ్డి రూ.10,00,116, శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116, బర్డ్ ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించింది. శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు బ్రింద హాస్పటల్ అధినేతలు డాక్టర్ భవన హనుమ శ్రీనివాసరెడ్డి, వసంత సిద్ధార్థలు ఈ విరాళం డీడీలను అందజేశారు. కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, నాట్కో ట్రస్టు ఎగ్జిక్యూటీవ్ వైస్ ప్రెసిడెంట్ నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
పొంగలి షెడ్డు నిర్మాణానికి విరాళం
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని 17వ వార్డులో ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయంలో పొంగలి షెడ్డు నిర్మాణానికి మంత్రి నారా లోకేష్ తన సొంత నిధుల నుంచి రూ. 1.50 లక్షల విరాళం అందజేశారు. ఆయన తరఫున బుధవారం టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు ఈ మొత్తాన్ని ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాడిబోయిన భాస్కర్, గుద్దంటి నాగేశ్వరరావు, ఇట్టా భాస్కర్, నిర్మల, రాంబాబు, గోపి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.


