కర్లపాలెం: సేంద్రియ వ్యవసాయంతో నాణ్యమైన పంటలు పండించవచ్చునని బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి లక్ష్మి తెలిపారు. మంగళవారం కర్లపాలెం గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రైతులతో ఆమె మాట్లాడుతూ పైర్లకు వ్యవసాయాధికారులు సూచించిన మోతాదు మేరకే ఎరువులు వేయాలని చెప్పారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటించటం వలన భూసారాన్ని కాపాడుకోవచ్చునన్నారు. తప్పనిసరిగా పంట నమోదు చేయించాలని చెప్పారు. ఆగస్టు 15వ తేదీ లోపు పంటల బీమా నమోదు చేయించుకోవాలని రైతులకు తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సుమంత్‌కుమార్, విస్తరణాధికారి భాగ్యలక్ష్మి, శ్రీకాంత్, వినయ్, రైతులు తదితరులు ఉన్నారు.
బాపట్ల: ఆస్తి విషయంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన బాపట్ల మండలం స్టూవర్టుపురం గ్రామంలో చోటు చేసుకుంది. బాపట్ల డీఎస్పీ సీహెచ్ చంద్రమౌళి తెలిపిన వివరాల మేరకు... మండలంలోని స్టూవర్టుపురం గ్రామానికి చెందిన కర్రెద్దుల జేబుదాసు(30)అనే తన మామ దేవర కృష్ణాల మధ్య అస్తి విషయంలో కొన్ని రోజుల నుంచి వివాదం ఉంది. ఈ నెల 9వ తేదీన జేబుదాసు కృష్ణా వద్దకు ఈ విషయం అడిగాడు. కృష్ణా సూచన మేరకు అతని అనుచరుడు కిషోర్ కుమార్ ట్రాక్టర్ సైలెన్స్‌ర్ గొట్టంతో జేబుదాసును తలపై దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈ నెల 11వ తేదీన మృతి చెందాడు. జేబుదాసు తల్లి మణిమ్మ ఫిర్యాదు మేరకు వెదుళ్లపల్లి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన కిషోర్ కుమార్‌ను చీరాల మండలం బోయినవారిపాలెం పంట కాలువ బ్రిడ్జి వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. రిమాండ్ నిమిత్తం కోర్టు ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. కృష్ణా కోసం గాలింపు చర్యలు చేపట్టామని డీఎస్పీ చెప్పారు.
మార్టూరులో వెలుగు చూసిన ఘరానా మోసం
మార్టూరు: కారు యజమానుల నుంచి వాహనాలను బాడుగ పేరుతో తీసుకోవడం వాటిని ఇతరుల వద్ద తాకట్టు పెట్టి నగదు దండుకొని జల్సాలు చేస్తున్న యువకుడి ఉదంతం మంగళవారం మార్టూరు పోలీసులు ఛేదించారు. ఎస్సై బాబురావు, బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. మార్టూరుకు చెందిన పొదిలి నరేంద్ర వాహనాల యజమానుల నుంచి ప్రతిరోజూ వాహనాలను బాడుగకు తిప్పి ఏ రోజుకు ఆ రోజు సాయంత్రం రూ.2వేలు బాడుగ ఇచ్చే ప్రాతిపదికన కార్లను అద్దెకు తీసుకుంటుంటాడు. అనంతరం ఆ వాహనాలను ఇతర ప్రాంతాల్లోని ప్రైవేటు వ్యక్తుల వద్ద తాకట్టు పెట్టి పెద్ద మొత్తంలో నగదు తీసుకొనేవాడు. వాహనాల యజమానులకు ప్రతిరోజూ సాయంత్రం రూ.2వేల చొప్పున అద్దె చెల్లిస్తూ ఉండటంతో విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. నరేంద్ర తాకట్టు పెట్టిన వాహనాలు ఇతరుల వద్ద గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేంద్ర మార్టూరుకు చెందిన కార్లను ద్రోణాదుల, నాగండ్ల, పూనూరు, పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో మొత్తం ఐదు వాహనాలను బాడుగ పేరుతో తీసుకొని తాకట్టు పెట్టి రూ.5లక్షలకు పైనే అప్పు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని అతను తాకట్టు పెట్టిన వ్యక్తుల నుంచి వాహనాలను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై బాబూరావు తెలిపారు.
పిడుగురాళ్ల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ద్వై వార్షిక 2026లో జూనియర్ డాక్టర్స్ నెట్‌వర్క్(జేడీఎన్) రాష్ట్ర చైర్మన్ 2026–28 పదవికి పిడుగురాళ్ల పట్టణానికి చెందిన డాక్టర్ దూళ్లిపాళ్ల భరత్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఆయన మంగళవారం తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలను ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్ డాక్టర్ జీఎస్ మూర్తి అధికారికంగా ప్రకటించినట్లు తెలిపారు.


