బాపట్ల: జిల్లా పోలీస్ శాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం అభినందనీయమని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ కొనియాడారు. 2026 జూలై 6 నుంచి 8వ తేదీ వరకు మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో నిర్వహించిన 14వ సీనియర్ నేషనల్ పెన్‌కాక్ సిలాట్ చాంపియన్‌షిప్ 2026–27 పోటీల్లో కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించే వీరంకి నరేంద్ర సత్తా చాటి సిల్వర్ మెడల్ సాధించారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నరేంద్రను ఎస్పీ అభినందించి మెడల్‌తో సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూనే జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు. షిల్లాంగ్‌లో జరిగిన 14వ సీనియర్ నేషనల్ పెన్‌కాక్ సిలాట్ ఛాంపియన్‌షిప్ 2026–27 పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి జిల్లా పోలీస్ శాఖ కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయడం గర్వకారణమన్నారు. గతంలో కూడా నరేంద్ర అనేక జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పలు పతకాలు సాధించారని తెలిపారు. ఇప్పటివరకు ఆయన ఒక గోల్డ్, రెండు సిల్వర్, రెండు బ్రాంజ్ మెడల్స్ జాతీయ స్థాయిలో సాధించడం గర్వకారణమన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగైన శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటాలని ఆకాంక్షించారు. క్రీడల ద్వారా ఒత్తిడిని సునాయాసంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు. పీజీఆర్‌ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


